కులమే విదేశీ శక్తుల కుట్ర, కులగణన కాదు..!
-ఆర్. రాజేశమ్ (సేకరణ)
-కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 17 ( లోకంతీరు ) : పదమూడేళ్ల అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొని ఇంద్రప్రస్థపురికి చేరుకున్న పాండవులు.. కౌరవుల దగ్గరికి రాయబారం పంపారు. మేమూ కురువంశ వారసులమే, మాకు దక్కాల్సిన న్యాయమైన వాటా మాకు ఇవ్వాల్సిందే అనే డిమాండును కౌరవ సభలో పెట్టారు. తమ సోదరులకు దక్కాల్సిన న్యాయమైన వాటా వారికివ్వడానికి మనసొప్పని కౌరవులు.. నానారకాల సాకులు ముందుకు తీసుకొచ్చి పాండవుల న్యాయమైన కోర్కెలను తిరస్కరించి.. యుద్ధానికి, వినాశనానికి కారకులయ్యారు. నాటి కౌరవుల నేటి వారసులు.. తమ సోదరుల న్యాయమైన వాటాను తిరస్కరించడానికి సాకులు చూపుతూ.. మీ కోర్కెలు మీవి కావు, విదేశీ శక్తులు ప్రేరేపిస్తేనే మీరిలా మాట్లాడుతున్నారంటూ ఉల్టా బుకాయిస్తున్నారు. డా. కె. అరవిందరావు గారి వ్యాసం (“కులగణన విదేశీ శక్తుల ఎజెండా” తేదీ 4.2.23, ఆంధ్రజ్యోతి) చదివాక దేశంలోని మెజార్టీ వర్గపు ప్రజలకు ఆ పాత ముచ్చట యాదికొస్తున్నది. నాటి పాండవులు 5గురు, కౌరవులు 100 మంది. నేడు.. కులగణన చేసి సామాజిక సంపదలో మా న్యాయమైన వాటా తేల్చండి అని అడుగుతున్న వారు జనాభాలో 90 శాతం కాగా.. ఆ న్యాయమైన కోర్కెలను తిరస్కరించి అన్యాయాన్ని కొనసాగించ దలుచుకున్నవారు పదిశాతపు మైనారిటీయే! ఇదీ నేటి విషాదం!
ఈ దేశంలో రెండువేల యేళ్ల పాటు నిరంకుశంగా కొనసాగిన కులవివక్ష కారణంగా సమఅభివృద్ధికి దూరమైన బీసీ వర్గాల ప్రజలు నేడు కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జనాభా లెక్కల్లో భాగంగా ఎస్సీ ఎస్టీల లెక్కలు మొదటి నుండి తీస్తున్నారు. వాటి తో పాటు బీసీ వర్గాల లెక్కలు కూడా తీసి.. రిజర్వేషన్లు, సంక్షేమ ఫలాల్లో తమకు దక్కాల్సిన న్యాయమైన వాటాను అందించాలని ఆ వర్గపు ప్రజలు కోరుతున్నారు. తమ సోదరుల న్యాయమైన డిమాండ్లను గుర్తించ నిరాకరిస్తున్న కొందరు మనువు వారసులు.. కులగణన తగదంటూ వాదనలు తీస్తున్నారు. ఈ వ్యాసం కూడా అలాంటి వాదనల్లో ఒకటి.
అరవింద రావు గారి వ్యాసంలో కొన్ని అబద్ధాలు మరికొన్ని అసంబద్ధపు వాదనలు ఉన్నాయి. అబద్ధాలేమిటో ముందు పరిశీలిద్దాం. “దేశంలో అద్వానీ రథయాత్ర సమయంలో ఒక సాంస్కృతిక జాగరణ జరిగే సమయంలో వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేసింది.” అని రాసాడు ఆయన. అద్వానీ రథయాత్ర ముందు మొదలై.. ఆ తర్వాతనే మండల్ కమిషన్ అమలు నిర్ణయం వెలువడి ఉంటే అరవింద రావు గారి వాదన నిజమవుతుంది. మరి చరిత్రలో వాస్తవంగా జరిగింది ఏమిటి? ఆగష్టు 7, 1990న వి.పి. సింగ్ గారు మండల్ కమిషన్ నివేదిక అమలు నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రకటించాడు, ఓబీసీ అభ్యర్థులకు 27% రిజర్వేషన్లను తీసుకొచ్చాడు. ఆ తర్వాత.. మరో యాభై రోజులు గడిచాక.. సెప్టెంబరు 25, 1990న గుజరాత్‌లోని సోమనాథ్ నుండి అద్వానీ తన రామ రథయాత్రను ప్రారంభించాడు. క్రోనాలజీ తేల్చి చెబుతున్నది ఏమిటంటే.. అద్వానీ రథయాత్ర తీసుకురాదలచిన సాంస్కృతిక జాగరణను ఓబీసీ రిజర్వేషన్లు అడ్డుకోలేదు. ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికే.. నాటి అగ్రవర్ణాల ప్రోద్బలంతో అద్వానీ తన రథయాత్ర మొదలుపెట్టారు!
హిందూమతం కులాన్ని నిర్మించిందన్న ప్రచారం బ్రిటిష్ వాడు సృష్టించిందేనంటూ మరో అబద్ధమాడేసారు వ్యాసరచయిత. మన చరిత్ర మాత్రం అసలు సత్యాన్ని బహిర్గత పరుస్తున్నది. 12వ శతాబ్దికి చెందిన పల్నాటి బ్రహ్మనాయుడు వెలమ కులానికి చెందిన వాడని.. మాల కులానికి చెందిన కన్నమదాసును దత్తత తీసుకున్నాడని.. సమాజంలో నెలకొన్న కులవిభేదాలను నిర్మూలించడానికి చాపకూడు నిర్వహించాడని చరిత్రలో నమోదు అయివున్నది. 16వ శతాబ్దికి చెందిన పోతులూరి వీరబ్రహ్మం, వేమనలు.. కులం పేరిట నాటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడము, బ్రాహ్మణులే తమ స్వార్ధం కొరకు కులం పేరుతో హెచ్చుతగ్గులను ప్రవేశపెట్టారంటూ స్పష్టంగా తేల్చి చెప్పడమూ నిజం కాదా? ఈ చరిత్ర అంతా బ్రిటిష్ వాడి రాక పూర్వమే కదా!? మన బంగారం మంచిగ లేక.. బ్రిటిషోడిని ఆడిపోసుకుంటే ఫాయిదా ఏమి?
హిందూ మత గ్రంథాల్లో నాలుగు వర్ణాల గురించే ఉన్నదని.. కులాల సృష్టి బ్రాహ్మణులు చేయలేదని అంబేడ్కర్ కూడా అన్నాడని వ్యాసకర్త రాసారు. వర్ణ వ్యవస్థ పాదులోంచే కుల వ్యవస్థ రూపుదాల్చుకున్నదని మన సమాజ పరిణామ క్రమం స్పస్టీకరిస్తున్నది. దేవుడి పేరుతో, మతం పేరుతో.. సమాజంపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించిన బ్రాహ్మణ వర్గాల నిర్దేశకత్వంలోనే వర్ణ వ్యవస్థ రూపుదిద్దుకున్నది. వర్ణ వ్యవస్థలో బాధిత సమూహమైన శూద్ర వర్ణంలోని ప్రజల్ని మరింత చీల్చడం కోసం, పైనున్న వర్ణాల దోపిడీ నిరాటంకంగా కొనసాగించడం కోసమే.. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించడం జరిగింది. వర్ణ వ్యవస్థయినా, కుల వ్యవస్థయినా.. రెంటిలో సారం ఒకటే. “ఏకమేవతు శూద్రస్య ప్రభుః కర్మసమాదిసత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూషా మనసూయయా” (మనుస్మృతి 1-91) – అసూయ లేకుండా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్ణాల వారికి సేవ చేయడమే శూద్రుల, శూద్రకులాల వారి విధి అని బ్రహ్మ అదేశించాడన్న నియమమే.. అటు వర్ణ వ్యవస్థలోనూ ఇటు కుల వ్యవస్థలోనూ అమలయింది కదా!?
సాటి సోదరుడిని బానిసగా మార్చిన ఆ పాపకార్యానికి మూలం వేరేచోట ఉండవచ్చునంటూ బుకాయిస్తే సరిపోతుందా? కుల వ్యవస్థ వల్ల లాభ పడ్డది, చివరి దాకా దాన్ని నిలబెట్టాలని చూస్తున్నది బ్రాహ్మణ వర్గమేనని అంబేద్కర్ తేల్చి చెప్పలేదా?
సామాన్య శక పూర్వం 1700 ప్రాంతంలో మధ్య ఆసియా ప్రాంతం నుండి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చి.. స్ధానిక తెగలపై ఆధిపత్యం సాధించి చాతుర్వర్ణ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆ వర్ణ విభజనలో.. ఉన్నత స్థానాన్ని తమకు అంటిపెట్టుకొని, నిమ్న స్థాయిని మూలవాసులకు ఆపాదించారు. వర్ణవ్యవస్థలోని బాధితుల మధ్యన మరిన్ని విభజనలు తెస్తూ కుల వ్యవస్థను మొదలుపెట్టారు. తన బిడ్డల్లో కొందరు భూసురులు ఎట్లయితరో.. మరికొందరు క్షుద్రులు, మ్లేచ్ఛులు ఎట్లయితరో.. ఆ భగవంతుడికే అంతు పట్టని విషయం! ఈ వర్ణ-కుల వ్యవస్థ విదేశీ ఆర్యుల సృష్టి తప్ప మరొకటి కానేకాదన్నది చరిత్ర నిరూపించిన సత్యం. రాచపుండు లాంటి కులాన్ని ఈ దేశానికి అంటగట్టిన ఘనత ఆ విదేశీ గుంపులదే. ఆ కుల వ్యవస్థ రుద్దిన అన్యాయాల పరిధిని తేల్చడం కోసమే, చేయాల్సిన చికిత్సను నిర్ధారించడం కోసమే.. బాధిత సమూహాలు నేడు కులగణన కావాలని కోరుతున్నాయి. కులమే విదేశీ శక్తుల కుట్ర తప్ప.. కులగణన కాదు! కులగణన నేడు ఒక దేశభక్తియుత కర్తవ్యము!!
మండల్ కమిషన్ కాలం నుంచి జాతీయ భావన బలహీనమైందని వాపోతున్న అరవిందరావు గారు.. తన దృష్టిలో జాతీయ భావన అంటే ఏమిటో తెలుపకనే తెలిపారు. మైనార్టీ గుంపొకటి.. సమాజంలో కృత్రిమ విభజనను సృష్టించి, దానికి దైవామోదం ఉన్నదని నమ్మించి.. మెజార్టీ వర్గాల ప్రజల హక్కులను కొల్లగొట్టడం, వారిని సమాన అవకాశాలకు దూరం చేయడం.. జాతీయ భావన ఎలా అవుతుంది?
ఆ కఠిన వాస్తవాన్ని గుర్తించిన మండల్ కమిషన్ సభ్యులు.. ఆ రుజాగ్రస్త అవస్త నుండి సమాజాన్ని గట్టెక్కించడానికి అవసరమైన చికిత్సను సిఫారసుల రూపంలో అందించారు. మండల్ కమిషన్ అమలు ద్వారా, బహుజన వర్గాలకు సమ న్యాయం అందించడం ద్వారా నిజానికి జాతీయ భావన దేశంలో పెరుగుతుందే తప్ప తగ్గదు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య సమభావం విలసిల్లి, సౌభ్రాతృత్వానికి దారి తీయడమే అసలైన జాతీయ భావన కాదా?
గణాంకాల సేకరణ ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.. దేశంలో నెలకొన్న పరిస్థితిని గణాంకాలు తేల్చిచెబుతాయి. జనాభా లెక్కల్లో మతాల వారీ లెక్కలను, వివిధ భాషలను మాట్లాడేవారి జనాభా ఎంతో సైతం తేలుస్తున్నారు. జనాభా లెక్కల కారణంగా మత వైషమ్యాలు, భాషా విభేదాలు చెలరేగుతున్నాయనే వాదనలు నేటివరకు ఎవ్వరూ లేవనెత్తలేదు. కులాల వారీ జనాభా లెక్కల సేకరణ సైతం అదే రీతిలో.. ఎలాంటి అవాంఛిత పరిణామాలకు దారి తీయదు. “Fraud and deceit only dread examination. Truth invites it.” అంటాడు Samuel Johnson. సాటి సోదరులను మోసగించి ఇప్పటివరకు అన్యాయంగా దండుకు తింటున్న వారే లెక్కలు తీయడాన్ని అడ్డుకుంటున్నారు. గణాంకాల సేకరణను, సామాజిక సంపదల సమ పంపిణీని అందరూ స్వాగతించాల్సిందే. సామాజిక వివక్ష కారణంగా సమ అభివృద్ధికి నోచుకోని వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికి తోడ్పడడంతో పాటు.. ఆయా వర్గాల ప్రజల మధ్య అనవసర గొడవలను నివారించి దేశ ఐక్యతకు సహకరిస్తుంది కులగణన. దేశ ప్రజలకు సామాజిక న్యాయం అందించడమనేది.. ఆయా వర్గాలకు అందించే భిక్షగా భావించరాదు. దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో అది ఒక భాగం.