Take a fresh look at your lifestyle.

సాగులో వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన.

0 27

సాగులో వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన.

వ్యవసాయంపై ఆసక్తి పెంచుకోవాలి.

కెరీర్‌లో లక్ష్యాలను ఏర్పరచుకుని కృషి చేయాలి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

ఖమ్మం , సెప్టెంబర్ 9: తిరుమలాయపాలెం మండలం జల్లిపల్లి, బీరోలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం వ్యవసాయంలో వృత్తి విద్యా మార్గదర్శకాలు, కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ కామన్ ఫార్మర్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మగాని నరసింహారావు వ్యవసాయ విద్యపై, రిటైర్డ్ ఎండీఓ ఎం.డి. నవాబ్ పాషా కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, నేల, విత్తనాలు, ఎరువులు, నీటి వినియోగంపై ప్రాథమిక అవగాహనతో పాటు ఆధునిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాల కోసం అగ్రికల్చర్ వొకేషనల్ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్ట్, డ్రిప్, స్ప్రింక్లర్ విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మెట్ట ప్రాంతంలో టమాట సాగుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. నవాబ్ పాషా మాట్లాడుతూ, విద్యార్థులు ముందుగా లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధనకు ఏకాగ్రతతో కృషి చేయాలని సూచించారు. తమకు ఆసక్తి ఉన్న రంగంలో అవకాశాలను అన్వేషిస్తూ, వైఫల్యాలకు నిరాశ చెందకుండా ముందుకు సాగాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే నిజమైన హీరోలని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారా రాజేష్ మాట్లాడుతూ, వ్యవసాయ విద్య, డ్రిప్, సస్యరక్షణ, నీటి వినియోగంపై నరసింహారావు అందించిన సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.