Take a fresh look at your lifestyle.

బూటకపు మెడికల్ బోర్డును రద్దు చేసి రీ-మెడికల్ బోర్డు నిర్వహించాలి: ఏఐటియుసి.

0 26

బూటకపు మెడికల్ బోర్డును రద్దు చేసి రీ-మెడికల్ బోర్డు నిర్వహించాలి: ఏఐటియుసి.

– కార్మికుల జీవితాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందని మిరియాల రంగయ్య ఆరోపణ.
– అర్హులైన కార్మికులను ఇన్వాలిడేట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 19:సింగరేణిలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డు ప్రక్రియను వెంటనే రద్దు చేసి, గతంలో అమలు చేసిన విధానంలోనే రీ-మెడికల్ బోర్డు నిర్వహించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుత మెడికల్ బోర్డు పారదర్శకంగా జరగలేదని, అనారోగ్యంతో ఉన్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐటియుసి ఇచ్చిన సమ్మె నోటీసు ఫలితంగానే యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించేందుకు ముందుకొచ్చిందని, అయితే నిర్వహించిన విధానం కార్మికుల ఆశలను దెబ్బతీసిందన్నారు. ఎంక్వైరీ పేరుతో దళారీల జోక్యం పెరిగిందని, కార్మికులు, వారి కుటుంబాలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను ఇన్వాలిడేషన్ చేయకుండా వారి కుటుంబాల భవిష్యత్తుతో యాజమాన్యం చెలగాటమాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ బోర్డు జాబితాలో పేర్లు ఉన్న పలువురు కార్మికులకు సైతం అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. మంచానికే పరిమితమైన వారు, అవయవాలు కోల్పోయిన వారు, గుండెకు స్టెంట్లు వేసుకున్న వారు, కిడ్నీ వ్యాధులతో యూరిన్ బ్యాగ్‌తో జీవిస్తున్న వారిని కూడా మెడికల్ బోర్డు పేరుతో ఇబ్బందులకు గురిచేయడం అమానవీయమన్నారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రి వైద్యులకు కార్మికుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలిసి ఉంటుందని, గతంలో ముఖ్య వైద్యాధికారి పరిధిలోనే అర్హులైన కార్మికులను ఇన్వాలిడేట్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి విధానాన్ని పక్కనబెట్టి కార్మికులను అనవసరంగా బోర్డుల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుత మెడికల్ బోర్డును రద్దు చేసి, గత విధానంలోనే తక్షణమే రీ-మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులైన అనారోగ్య కార్మికులను ఇన్వాలిడేట్ చేసి వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ బోర్డుకు ఉన్న రెండేళ్ల కాలపరిమితి నిబంధనను తొలగించి, సిక్‌లో ఉన్న కార్మికుడు దరఖాస్తు చేసిన వెంటనే ఇన్వాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సుమారు 2,000 మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్నారని, వారికి త్వరితగతిన న్యాయం చేయాలంటే నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని ఆయన సూచించారు. మెడికల్ బోర్డు నిర్వహణను తామే సాధించామని చెప్పుకున్న ఐఎన్‌టీయూసీ కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన మిరియాల రంగయ్య, ప్రభుత్వాన్ని సాకుగా చూపుతూ యాజమాన్యం కాలయాపన చేయవద్దని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం జరగకపోతే సింగరేణి వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.