Take a fresh look at your lifestyle.

ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యం:ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

0 10

ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యం:ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

– రొంపేడులో రూ.3.25 కోట్లతో 33/11 కేవీ ఉపకేంద్రానికి శంకుస్థాపన.
– ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌లో నూతన ఉపకేంద్రాన్ని ప్రజలకు అంకితం.
– విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ, సింగరేణి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 19:రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌లో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఉప ముఖ్యమంత్రికి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు, విద్యుత్ లైన్ల ఆధునికీకరణ, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాల పెంపు వంటి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా అందించేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ఆయన, సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు, ఉద్యోగుల సంక్షేమం, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సింగరేణి, విద్యుత్ సంస్థల ఉద్యోగుల భద్రత కోసం ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం రూ.1.20 కోట్ల ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని, పోడు భూముల హక్కులు పొందిన గిరిజన రైతులకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఉచిత సౌర విద్యుత్, బోర్‌బావులు, పంపుసెట్లు, డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్‌ఫ్రీ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, 108 అత్యవసర సేవల తరహాలో ప్రారంభించిన ‘పవర్ అంబులెన్స్’ సేవల ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సామగ్రి, సాంకేతిక సిబ్బందితో కూడిన బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 165 పవర్ అంబులెన్స్‌లు ప్రజలకు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు.  ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించిన ఆయన, తాగునీటి వనరుల పరిరక్షణ, వ్యవసాయ అవసరాలు, వన్యప్రాణులకు నీటి లభ్యత, నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రొంపేడు, ముత్యాలంపాడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ఉపకేంద్రాల వల్ల విద్యుత్ లోడ్ సమతుల్యమై వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎన్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.