
రాష్ట్ర అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి జిల్లాకు ఏడు పతకాలు.
– రెండు బంగారు, రెండు రజత, మూడు కాంస్య పతకాలతో అథ్లెట్ల సత్తా.
– విజేతలను అభినందించిన జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, జూలై 19:మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు విశేష ప్రతిభ కనబరిచారు. రెండు బంగారు, రెండు రజత, మూడు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. మహీధర్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్వంచకు చెందిన పి. హర్షిత 5,000 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం సాధించగా, కాచనపల్లికి చెందిన ఈ. విజయదుర్గ ట్రయథ్లాన్ గ్రూప్-సి విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఈ. సమీరా ట్రయథ్లాన్ గ్రూప్-ఎ విభాగంలో, వి. వెన్నెల ట్రయథ్లాన్ గ్రూప్-బి విభాగంలో రజత పతకాలు గెలుచుకున్నారు. కాంస్య పతకాల విభాగంలో వి. విశ్వప్రశాంతి ట్రయథ్లాన్ గ్రూప్-సి విభాగంలో, అంకంపాలెంకు చెందిన తాటి వర్షిత 10,000 మీటర్ల పరుగుపందెంలో, సున్నం శైలు 1,500 మీటర్ల పరుగుపందెంలో మూడో స్థానం సాధించి జిల్లాకు మరో మూడు పతకాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామరెడ్డి విజేతలను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన అథ్లెట్లను ప్రశంసించారు. అథ్లెటిక్స్ కోచ్‌లు పి. నాగరాజు, పి. నాగేందర్, పవన్‌ల కృషిని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు.