అవయవదాన అవగాహనకు కృషి చేస్తాం : ఐ ఆర్గాన్ & బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ కాటారం కమిటి.
అవయవదాన అవగాహనకు కృషి చేస్తాం.
ఐ ఆర్గాన్ & బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ కాటారం కమిటి ఎన్నిక .
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 26:ఐ ఆర్గాన్ & బాడీ డొనేషన్ అవేర్‌నెస్ అసోసియేషన్ కాటారం మండల కమిటీని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఆత్మకూరి కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా కడారి విక్రమ్, ప్రధాన కార్యదర్శిగా గంట దేవదాస్, సలహాదారుగా కొండగోర్ల రామనారాయణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పున్నం రమేష్, గోదారి మల్లేష్, మంత్రి మధు, ట్రెజరర్‌గా ఆత్మకూరి బాలరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గడ్డం కొమురయ్య యాదవ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు బందెల భూమన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆత్మకూరి కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. అవయవాలు, శరీరదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఒక వ్యక్తి మరణానంతరం కూడా కిడ్నీలు, కాలేయం, గుండె, కంటి కార్నియా వంటి అవయవాలను దానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. అలాగే శరీరదానం వైద్య విద్యార్థుల శిక్షణ, వైద్య పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లా చైర్మన్ చంద్రమౌళి మాట్లాడుతూ, అవయవాల కొరత కారణంగా వేలాది మంది రోగులు మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రతి కుటుంబం అవయవ, శరీరదానాల ప్రాముఖ్యతను గుర్తించి ఈ మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అవయవదానం మానవత్వానికి ప్రతీక అని, మరణానంతరం కూడా పలువురికి జీవం ప్రసాదించే గొప్ప సేవ అని అన్నారు. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 3న అంతర్జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అవగాహన వర్క్‌షాప్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కిరణ్, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, జేసీ రాజు, సాంబయ్య గౌడ్ తదితరులు నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు.