హామీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్ అధికారం వీడాలి: జనసేన
ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్లలో పోటీ చేస్తాం – డాక్టర్ గడల శ్రీనివాసరావు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 26:ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నైతిక బాధ్యతతో అధికారం నుంచి తప్పుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు, చేరికల కమిటీ బాధ్యులు డాక్టర్ గడల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన 400 హామీలు, ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. యువతులకు స్కూటీలు, మహిళలకు తులం బంగారం వంటి హామీలు నెరవేరలేదని విమర్శించారు. వైరల్ జ్వరాలు, మలేరియా విజృంభిస్తున్నా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ) తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు బీ-టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోడు భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడం, అశ్వాపురం మనుబోతులగూడెం ఘటన వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ జనసేన మాత్రమేనని, ప్రజల కోసం నిరంతరం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే కార్యాచరణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూరియా యాప్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్, దోమతెరల పంపిణీ వంటి చర్యలు సరిగా చేపట్టలేదని ఆరోపించారు. ఆదివాసీల ఆరోగ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో పురోగతి లేదన్నారు. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, కేటీపీఎస్ రెండో దశను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని, భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 2న దమ్మపేటలో నిర్వహించనున్న జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం క్యాలెండర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర నాయకులు రాము యాదవ్, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి ఉమిరియాల రామకృష్ణ, జిల్లా నాయకులు సాదిక్, వీర మహిళ దివ్య, తాటికొండ ప్రవీణ్, వేణు, రహీం, ఉషికల రమేష్ తదితరులు పాల్గొన్నారు.