
భూపాలపల్లి కేటీకే-1 ఇంక్లైన్ గనిలో కార్మికుడు మృతి.
సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన కార్మికులు.
యాజమాన్య నిర్లక్ష్యం వల్లే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు – అప్పాని.
ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 20: సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లైన్ గనిలో విధులు నిర్వహిస్తున్న కోల్ కట్టర్ గోపాల గోపీ (39) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. రాత్రి షిఫ్టులో 28 డిప్, 14 లెవల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గోపీకి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి, తల తిరగడంతో తోటి కార్మికులు వెంటనే గని నుంచి బయటకు తీసుకువచ్చారు. గనిపై సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
గోపీ మృతిపై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కార్మికులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏరియా ఆసుపత్రి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, సుధాకర్, చంద్రమౌళి, ఐఎన్‌టీయూసీ నాయకులు బేతెల్లి మధూకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గడిపె చక్రపాణి, ఎస్.కె. హుస్సేన్, సొతుకు సమ్మయ్య, బీఎంఎస్ నాయకులు సుజేందర్, రాసకట్ల నర్సింగరావు, భాస్కర్, మొరం లక్ష్మణ్, కోటేష్, టిబిజికేఎస్ నాయకులు బడితెల సమ్మయ్య, రత్నం అవినాష్ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా, సంఘటన తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఏరియా ఆసుపత్రికి చేరుకుని సంఘటన వివరాలు తెలుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద గందరగోళం నెలకొనడమే కాకుండా, ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది.
ఈ సందర్భంగా బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ స్పందిస్తూ..గనిలో కార్మికుడికి ఛాతీలో నొప్పి వచ్చిన సమయంలో అధికారులు తగిన సీపీఆర్, ప్రథమ చికిత్స అందించలేదని ఆరోపించారు. కనీసం ఆక్సిజన్ కూడా అందించలేదని, అంబులెన్స్‌లో కేవలం ఒక్క కార్మికుడినే వెంట పంపించడంపై ప్రశ్నించారు. ఆసుపత్రికి తరలించిన అనంతరం కూడా వైద్యులు సీపీఆర్ చేసే ప్రయత్నం చేయకుండానే మృతి చెందినట్లు నిర్ధారించారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే .. గోపీకి ‘డిజ్జినెస్’ (తల తిరగడం)గా అనిపిస్తోందని చెప్పడంతో వెంటనే గని లోపలి నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. గనిపై సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించామని, అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే గోపీ మృతి చెందినట్లు గుర్తించారని పేర్కొన్నారు.
కాగా, సంఘటన విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి స్వయంగా ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన కార్మిక సంఘాల నాయకులతో ఆయన మాట్లాడారు. సంబంధిత సింగరేణి అధికారులు కూడా ఆసుపత్రి వద్దే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనపై కార్మిక సంఘాల ఆరోపణలు, సింగరేణి అధికారుల వివరణల నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.