
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.
సంఘం ఐక్యతతో హక్కులు సాధించుకోవాలి: మల్లెల వీరన్న.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, ఆగస్టు 19: ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మ తల్లి గుడి సమీపంలోని శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుధవారం ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండాను ఆ సంఘం మండల అధ్యక్షుడు మల్లెల వీరన్న ఆవిష్కరించారు. అనంతరం మల్లెల వీరన్న మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యంగా, కలిసికట్టుగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని, ఐక్యతతో తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సంఘ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా సంఘం తరఫున అండగా నిలుస్తామని, జిల్లా నాయకత్వంతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సంఘం తరఫున ఇప్పటికే పలువురికి సహాయ సహకారాలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లతో కేక్ కట్ చేయించి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం పట్టణంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు మారగాని వెంకట్ నేతృత్వంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం రూరల్ మండల కోశాధికారి ఎస్.కె. గౌస్, ప్రధాన కార్యదర్శి టీ. రవి, గౌరవాధ్యక్షుడు పి. రమేష్ బాబు, గౌరవ సలహాదారులు ఏ. రామమూర్తి, శ్రీనివాస్ రెడ్డి, ఏర్పుల రాజు, జిల్లా కోశాధికారి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కనకారావు, జిల్లా నాయకులు దామోదర్, మస్తాన్, రూరల్ మండల ఫోటోగ్రాఫర్లు రామలక్ష్మణులు, అశోక్, వంశీ, మధు, మహేష్, ప్రవీణ్, గోపి, నరేష్, సురేష్, ఏ. ఉపేందర్, సందీప్, ఎన్. రవి, ఎం. శంకర్, యాకూబ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.