Take a fresh look at your lifestyle.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి : ఐక్యవేదిక.

0 2

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.
అక్రమ కేసులు ఎత్తివేసి, ఉపా చట్టాన్ని రద్దు చేయాలి: ఐక్యవేదిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 19: దేశంలో వివిధ ప్రజా, సామాజిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్న రాజకీయ కార్యకర్తలు, ఉద్యమకారులు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లిలోని సింగరేణి ఉద్యోగుల సంఘం బాతాల రాజన్న భవన్‌లో ఐక్యవేదిక పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామిక హక్కులు, జీవించే హక్కు, జీవనోపాధి, సామాజిక న్యాయం కోసం దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీలు జల్, జంగల్, జమీన్, ఆత్మగౌరవం కోసం దీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రమదోపిడీ, కుల, మత వివక్షకు వ్యతిరేకంగా సామాజిక మార్పు కోసం వివిధ రాజకీయ, ప్రజా ఉద్యమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడం, రచనలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, న్యాయపోరాటాలు చేయడం, మీడియా ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చట్టాలను ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడం, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదని నాయకులు అన్నారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, మైనారిటీ వర్గాలకు చెందిన రాజకీయ ఖైదీలపై నమోదు చేసిన కేసులను సమీక్షించి, అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ దుబాసి పార్వతి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య నాయకుడు అయిత బాపు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.