గచ్చిబౌలిలో హుక్కా సెంటర్‌పై పోలీసుల మెరుపు దాడి.
నలుగురికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్.. నిర్వాహకుడి కోసం గాలింపు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9: హైదరాబాద్ గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ రోడ్డులో ఉన్న క్లౌడ్ నైన్ హుక్కా సెంటర్ (క్లౌడ్-9 లాంజ్)పై పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిషేధిత పొగాకు, అక్రమ హుక్కా ఫ్లేవర్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడి సమయంలో హుక్కా సెంటర్‌లో ఉన్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు నేరుగా లభించలేదని తెలుస్తోంది. అయితే పోలీసులు నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో నలుగురికీ పాజిటివ్‌గా ఫలితాలు వచ్చినట్లు సమాచారం.
బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా?
పోలీసుల విచారణలో అదుపులోకి తీసుకున్న యువకులు బెంగళూరుకు చెందిన బిజు మాథ్యూ అనే వ్యక్తి నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం. దీంతో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
నిర్వాహకుడి కోసం గాలింపు:
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. హుక్కా సెంటర్ నిర్వాహకుడు రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సమాచారం. హుక్కా సెంటర్‌లో నిషేధిత పదార్థాల వినియోగం, డ్రగ్స్ సరఫరా తదితర అంశాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.