Take a fresh look at your lifestyle.

క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్‌వర్క్ : భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.

0 4

క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్‌వర్క్.
మహిళా ఉద్యోగులు క్రీడల్లో రాణించాలి: జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 11:క్రీడలు ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం, సానుకూలతను పెంపొందించడంతో పాటు మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్‌వర్క్‌ను వికసింపజేస్తాయని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆధునిక జీవన విధానంలో వర్క్‌–లైఫ్ బ్యాలెన్స్ కోసం క్రీడలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ (వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్)లో భాగంగా భూపాలపల్లి, రామగుండం-3 ఏరియాలను కలుపుకుని నిర్వహిస్తున్న హాకీ రీజినల్ మీట్ పోటీలను శుక్రవారం కృష్ణకాలనీలోని సింగరేణి అంబేద్కర్ స్టేడియంలో జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో ప్రతి ఏడాది నిర్వహించే డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ క్రీడలు ఉద్యోగులకు ఒక వేడుకలా నిలుస్తున్నాయని అన్నారు. క్రీడలను దైనందిన కార్యకలాపాల్లో భాగం చేసుకుని ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో గణనీయ సంఖ్యలో మహిళా అధికారులు నియమితులయ్యారని జీఎం తెలిపారు. వారు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్నారని, మహిళా రెస్క్యూ బృందాలను కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళా ఉద్యోగులు సింగరేణిలోని అన్ని రంగాల్లో, ముఖ్యంగా క్రీడల్లో స్ఫూర్తిదాయకంగా ముందుకు రావాలని కోరారు. త్వరలో జరగనున్న కోల్ ఇండియా క్రీడా పోటీల్లో సింగరేణిని ముందువరుసలో నిలబెట్టేలా క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పోటీపడి పతకాలు సాధించాలని జీఎం ఆకాంక్షించారు. హాకీ రీజినల్ మీట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు, పాల్గొంటున్న క్రీడాకారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బి. మధుకర్ రెడ్డి, భూపాలపల్లి సీఎంఓఐ అధ్యక్షుడు నజీర్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ రావు, ఆర్జీ-3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ బి. సదానందం, రెఫరీ జెల్ది రమేష్, క్రీడాకారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.