జాంబియాలో విజేతలుగా నిలిచిన సింగరేణి రెస్క్యూ బృందానికి ఉప ముఖ్యమంత్రి ఘన సన్మానం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, జూన్ 6: జాంబియాలో నిర్వహించిన అంతర్జాతీయ గనుల రెస్క్యూ పోటీలు-2026లో అద్భుత ప్రతిభ కనబర్చి భారతదేశానికి, సింగరేణి సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన సింగరేణి రెస్క్యూ బృందాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ గనుల రెస్క్యూ పోటీల్లో భూగర్భ గని రెస్క్యూ సన్నివేశం విభాగంలో ప్రథమ స్థానం సాధించిన ఐఎంఆర్సీ-2026 బృందం విజయాన్ని అభినందిస్తూ ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా బృంద సభ్యుల అంకితభావం, వృత్తి నైపుణ్యం, సాంకేతిక సామర్థ్యం, గని భద్రత పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసించారు. వారి విజయం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ (పర్సనల్ అండ్ ప్రాజెక్ట్స్)తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ, బృంద సభ్యుల కఠోర శ్రమ, క్రమశిక్షణ, నిరంతర సాధన ఫలితంగానే అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘన విజయం సాధ్యమైందన్నారు. అలాగే బృందాన్ని పోటీలకు సిద్ధం చేయడంలో రెస్క్యూ సర్వీసెస్ విభాగం చేసిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం బృంద సభ్యులకు జ్ఞాపికలు, పతకాలు అందజేసి సన్మానించారు.