క్లరికల్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి : జనక్ ప్రసాద్.
పదోన్నతి అర్హత కాలాన్ని ఏడేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించాలని క్లరికల్ ఉద్యోగుల విజ్ఞప్తి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 17: రామగుండం ఏరియా–1లో క్లరికల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డా. జనక్ ప్రసాద్ హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం స్థానిక ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో జీఎం ఆఫీస్ పిట్ సెక్రటరీ జబ్బార్ ఆధ్వర్యంలో క్లరికల్ సిబ్బంది సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి డా. జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లరికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న పదోన్నతులు, సర్వీస్ కండిషన్స్‌తో పాటు ఇతర ఉద్యోగ సంబంధిత సమస్యలపై సవివరంగా చర్చించారు. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ గ్రేడ్–సీ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ గ్రేడ్–బీ పదవికి పదోన్నతి పొందేందుకు ప్రస్తుతం ఉన్న ఏడేళ్ల అర్హత కాలాన్ని ఐదేళ్లకు తగ్గించాలని ఉద్యోగులు డా. జనక్ ప్రసాద్‌ను కోరారు. క్లరికల్ సిబ్బంది సర్వీస్ కండిషన్స్, పదోన్నతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డా. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. క్లరికల్ సిబ్బంది న్యాయమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పదోన్నతి అర్హత కాలాన్ని ఏడేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించాలన్న డిమాండ్‌ను కూడా సంబంధిత స్థాయిలో చర్చించి ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, పదోన్నతుల్లో న్యాయం కోసం ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. క్లరికల్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదానందం, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, జాయింట్ జనరల్ సెక్రటరీ బత్తుల పోచయ్య, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శేషు, జీఎం కార్యాలయ క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు.