ఎమ్మెల్యే సహకారంతో కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం.
సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తుమ్మల రాజారెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 15:సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తుమ్మల రాజారెడ్డి హామీ ఇచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని సీఐటీయూ పోరాటం చేస్తూ వస్తోందని, కానీ ఇటీవల గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యంతో సొంతింటి కల డిమాండ్ పై స్పష్టతలేని ఒప్పందం చేసుకుని తప్పు చేసిందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం-కార్మిక సంఘాలు సహకరించకున్నా..రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కూర్చుని కార్మికులకు సొంతిల్లు ఇప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంగా రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రస్తావన తేనున్నారని, 2026 సంవత్సరం పూర్తయ్యేలోపు కార్మికులకు సొంతిల్లు కట్టడానికి పునాది వేస్తామని రాజారెడ్డి ప్రకటించారు. సింగరేణి కార్మికుల సమస్యలను ఇటు యాజమాన్యం పట్టించుకోవడం లేదని, అటు గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక గాంధీ నగర్ లో 60 సంవత్సరాలుగా ఉన్న క్వార్టర్లను కూల్చి, అక్కడ కార్మికుల సొంతింటి కల నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సాగుతున్న ఈ ప్రయత్నం పట్ల సింగరేణి కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులందరూ భవిష్యత్తులో వెన్నుదన్నుగా ఉంటారని రాజారెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో సీఐటీయూ నాయకులు కుంట ప్రవీణ్ కుమార్, వంగల శివరాం రెడ్డి, అంబాల శ్రీనివాస్, తోట నరహరిరావు, సోమారపు వెంకన్న, ఎద్దు కుమార్, ఎస్కే గౌస్, శ్రీహరి, ఎడ్ల వెంకటేష్, సురేష్, వినేష్, అహ్మద్ పాషా, గుగులోత్ రామకృష్ణ, కొమ్మ రమేష్, జంగ సమ్మయ్య, బుద్ధర్తి సంతోష్, తుమ్మ లక్ష్మణ్, కుమారస్వామి, బుర్ర శ్రీనివాస్, పోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.