తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మరిన్ని భూపోరాటాలు.
సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది.
సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 16: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పేదల కోసం మరిన్ని భూపోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం భూపాలపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ర్యాలీ, సభలో ఆయన మాట్లాడారు. తొలుత కొమరయ్య భవన్ నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద జరిగిన సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశామని అన్నారు. అదే పోరాట స్ఫూర్తితో నేడు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ భూపోరాటాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పేదల హక్కుల కోసం భవిష్యత్తులోనూ మరిన్ని భూపోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. రజాకార్లు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేశారని, ఆ పోరాట స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాటి సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టుల త్యాగాలతో తెలంగాణ నేల ఎర్రబారిందని అన్నారు. నిజాం నిరంకుశ పాలనను కూలదోసిన ఘనత కమ్యూనిస్టులదేనని, పటేల్ సైనిక చర్య వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన రద్దయిందని అన్నారు. ఈ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి, 3 వేల గ్రామాలను విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని చెప్పారు. నాటి పరిణామాల్లో పటేల్ చీకటి ఒప్పందం కారణంగానే నిజాం రాజుకు గవర్నర్ పదవి దక్కిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను స్మరించుకుని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రతో పాటు అమరవీరుల జీవిత చరిత్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు మోటపలుకుల రమేష్, సుధాకర్‌రెడ్డి, సోతుకు ప్రవీణ్, ఫైండ్ల శాంతి, కొరిమి సుగుణ, 24వ వార్డు కౌన్సిలర్ వేముల జ్యోతి, నేరెళ్ల జోసెఫ్, శ్రీకాంత్, అన్నారపు రాజేందర్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోశం, రవికుమార్, గోలి లావణ్య, గంప శ్రావణి, గడ్డం స్వరూప, మట్టి నాగమణి, పెద్దమామల సంధ్య, సుభద్ర తదితర పార్టీ శ్రేణులు, కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు.