Take a fresh look at your lifestyle.

భూపాలపల్లిలో అక్రమ కూల్చివేతలు వెంటనే ఆపాలని చిరు వ్యాపారుల నిరసన దీక్ష.

0 4

అక్రమ కూల్చివేతలు వెంటనే ఆపాలి.
చిరు వ్యాపారులకు మద్దతుగా బీఎంఎస్ నాయకుల దీక్ష.
సింగరేణి స్థలాల పరిరక్షణకు పోరాటం చేస్తాం : గీస సంపత్ కుమార్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 3: రోడ్డు విస్తరణ పేరుతో చేపడుతున్న అక్రమ కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక చిరు వ్యాపారులు శనివారం సాయంత్రం నుండి నిరసన దీక్ష చేపట్టారు. లావుడియా మధుకర్, దొంగల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు బీజేపీ అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్ కుమార్, బీఎంఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజంధర్ మద్దతు తెలిపారు. శనివారం సాయంత్రం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో దీక్షను ప్రారంభించిన అనంతరం గీస సంపత్ కుమార్ మాట్లాడుతూ, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తామని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని అన్నారు. గత 30 ఏళ్లుగా సింగరేణి కార్మికుల పిల్లలు, బాధిత కుటుంబాలు, నిరుద్యోగ యువతతో పాటు పలువురు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని సంపత్ కుమార్ తెలిపారు. సింగరేణి తన స్థలాల్లో చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని పేర్కొన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణికి చెందిన స్థలాలు, ఆస్తుల విషయంలో రాజకీయ జోక్యం పెరిగిందని, వాటి పరిరక్షణపై అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు స్పష్టమైన ప్రణాళిక, రోడ్ మ్యాప్ లేకుండా భవనాలను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారులకు సంబంధించి ఆరుగురికి హైకోర్టు నుంచి స్టే ఉన్నప్పటికీ కూల్చివేతల విషయంలో చర్యలు కొనసాగుతున్నాయని సంపత్ కుమార్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ సమస్యను చట్టపరంగా పరిష్కరించాలని కోరారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను నిలిపివేసి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి స్థలాలు, ఆస్తుల పరిరక్షణ విషయంలో కార్మిక సంఘాలు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన అన్నారు. చిరు వ్యాపారులకు మద్దతుగా బీఎంఎస్‌తో పాటు ఇతర కార్మిక సంఘాలు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సింగరేణి ఆస్తుల విషయంలో రాజకీయ జోక్యాన్ని ప్రశ్నిస్తూ కార్మిక సంఘాలు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్షలో చిరు వ్యాపారులు చెన్నా సతీష్, గంటి రాజేందర్, మేనం తిరుపతి, ఊర పద్మ, రమేష్, బిక్షపతి, బీఎంఎస్ నాయకుడు కట్కూరి శ్రీనివాస్‌తో పాటు పలువురు వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.