Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఊడిపడిన పైకప్పు.

0 6

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఊడిపడిన పైకప్పు.
నవజాత శిశువుల వార్డులో ఘటన.. తప్పిన భారీ ప్రమాదం.
ఆందోళనలో రోగుల బంధువులు.. భవన భద్రతపై విమర్శలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 3: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో తీవ్ర కలకలం రేగింది. నవజాత శిశువులకు అత్యవసర చికిత్స అందించే వార్డులోని సిమెంట్ ప్లాస్టరింగ్ ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపడింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు భయాందోళనకు గురయ్యారు. నవజాత శిశువుల అత్యవసర సంరక్షణకు వినియోగించే అత్యంత సున్నితమైన వార్డులో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పైకప్పు పెచ్చులు కూలిన సమయంలో ఆ ప్రాంతంలో పసిపిల్లలు, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో అక్కడ శిశువులు లేదా సిబ్బంది ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేద ప్రజలు ఉచిత వైద్యం అందుతుందనే నమ్మకంతో వస్తుంటారని, అలాంటి ఆసుపత్రుల్లోనే భవనాల నిర్వహణ, నిర్మాణ నాణ్యతపై నిర్లక్ష్యం కనిపించడం ఆందోళనకరమని స్థానికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనతో ఆసుపత్రి భవనం భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఆసుపత్రి భవనాన్ని నిపుణులతో పూర్తిస్థాయిలో తనిఖీ చేయించి, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నవజాత శిశువుల వార్డుతో పాటు ఇతర వార్డుల్లోని పైకప్పులు, భవన నిర్మాణం, మౌలిక వసతుల భద్రతను కూడా సమీక్షించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని, ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలు, పసిపిల్లల భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పించాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.