Take a fresh look at your lifestyle.

మైనింగ్ సిబ్బంది ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం :మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి గడిపే చక్రపాణి.

0 2

మైనింగ్ సిబ్బంది ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం.
భూపాలపల్లి ఏరియాలో అన్ని గనులకు ఐఎన్టీయూసీ మైనింగ్ స్టాఫ్ షిఫ్ట్ ఇన్‌చార్జీల నియామకం.
సిబ్బంది కొరత, విధుల నిర్వహణలో ఇబ్బందులపై యాజమాన్యం దృష్టికి సమస్యలు.

పరిష్కారానికి కృషి చేస్తాం : మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి గడిపే చక్రపాణి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 10: సింగరేణి భూపాలపల్లి ఏరియాలో మైనింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారంతోపాటు వారి హక్కుల పరిరక్షణ, ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు, భూపాలపల్లి ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏరియాలోని గనులకు మైనింగ్ స్టాఫ్ షిఫ్ట్ ఇన్‌చార్జీలను నియమించారు. మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి గడిపే చక్రపాణి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ సిబ్బందిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా కేటీకే ఓసీ-2 మేనేజర్‌ను శనివారం కలిసి ఆయా షిఫ్టులకు నియమించిన మైనింగ్ సిబ్బంది ఇన్‌చార్జీలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా గనుల్లో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు, తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల ఏర్పడుతున్న పని ఒత్తిడి, సెలవులు, ఇతర విధుల సర్దుబాటుపై చర్చించారు.

సిబ్బంది కొరతతో విధుల నిర్వహణకు ఇబ్బందులు:

కేటీకే ఓసీ-2లో తగినంత మంది మైనింగ్ సిబ్బంది లేకపోవడం వల్ల న్యాయపరమైన, చట్టబద్ధమైన బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. గనుల నిర్వహణలో నిర్దేశిత నిబంధనలు పాటించడం, భద్రతా ప్రమాణాలను కాపాడటం, విధులకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం వంటి బాధ్యతలు కీలకమైన నేపథ్యంలో సిబ్బంది కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

అలాగే ప్లే డే, పీహెచ్‌డీ, ఎన్-1 వంటి విధుల సర్దుబాట్ల కారణంగా సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నారని, ఈ సమస్యపై జనరల్ మేనేజర్‌తో చర్చించి పరిష్కారం చూపాలని కోరారు. అండర్‌గ్రౌండ్ గనుల నుంచి ఓపెన్‌కాస్ట్ గనులకు అభ్యర్థన మేరకు బదిలీలు కల్పించే అంశాన్ని కూడా డా. జనక్ ప్రసాద్ ద్వారా సీఎండీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

గనుల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచడం, ప్రతి షిఫ్ట్‌లో బాధ్యతల స్పష్టత ఉండేలా చూడటం, ఉద్యోగులపై అనవసరమైన పని ఒత్తిడి పడకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై యాజమాన్యం దృష్టి సారించాలని వారు కోరారు.

జీవీటీసీలో కొత్త ఓవర్‌మెన్‌లకు పరిచయం:

జీవీటీసీలో కొత్తగా విధుల్లో చేరిన ఓవర్‌మెన్‌లను ఐఎన్టీయూసీ తరఫున జీవీటీసీ యాక్టింగ్ మేనేజర్ మనోజ్ కుమార్‌కు పరిచయం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఓవర్‌మెన్‌లకు అవసరమైన సహకారం అందించాలని, విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని కోరారు. మైనింగ్ సిబ్బంది మధ్య సహకారం, సమన్వయం పెరిగినప్పుడే గనుల నిర్వహణ మరింత సమర్థంగా సాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గనుల వారీగా షిఫ్ట్ ఇన్‌చార్జీల నియామకం:

కేటీకే-1 గనికి మైన్ ఇన్‌చార్జిగా ఉయ్యాల హుస్సేన్ (ఓఎం), రిలే-ఏకు శ్రీధర్ (హెచ్‌ఓఎం), రిలే-బికి కె. శ్రీనివాస్ (ఓఎం), రిలే-సికి సాయి సంతోష్ (సీనియర్ మైనింగ్ సర్దార్) నియమితులయ్యారు.

కేటీకే-5 ఇన్‌క్లైన్‌కు మైన్ ఇన్‌చార్జిగా డి. కరుణాకర్ (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-ఏకు మనోజ్ కుమార్ (ఓఎం), రిలే-బికి పి. రాజేందర్ (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-సికి నాగవంశీ (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-డికి మెల్ల కార్తీక్ (సీనియర్ మైనింగ్ సర్దార్)ను నియమించారు.

కేటీకే-6 ఇన్‌క్లైన్‌కు మైన్ ఇన్‌చార్జిగా ఎ. రాజశేఖర్ (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-ఏకు ఓం సాయి (ఓఎం), రిలే-బికి జూపాక శ్రీనివాస్ (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-సికి మెరుగు లచ్చయ్య (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-డికి బి. గణేష్ (ఓఎం) బాధ్యతలు చేపట్టనున్నారు.

కేటీకే ఓసీ-2కు మైన్ ఇన్‌చార్జిగా రత్నం సమ్మిరెడ్డి (హెచ్‌ఓఎం), రిలే-ఏకు వసంతరావు (హెచ్‌ఓఎం), రిలే-బికి ఎం. రామారావు (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-సికి కాపు చేరాలు (హెచ్‌ఓఎం), రిలే-డికి టి. ప్రకాష్ (హెచ్‌ఓఎం)ను నియమించారు.

కేటీకే-8 ఇన్‌క్లైన్, ఓసీ-3కు మైన్ ఇన్‌చార్జిగా అప్పం రాములు (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-ఏకు ఎ. ఉదయ్ (సీనియర్ మైనింగ్ సర్దార్), రిలే-బికి మల్లన్న (హెచ్‌ఓఎం), రిలే-సికి సీహెచ్. నరేశ్ (ఓఎం), రిలే-డికి ప్రేమ్ చాంద్ (ఓఎం)ను నియమించారు. జీవీటీసీ మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జిగా భరత్ (హెచ్‌ఓఎం) వ్యవహరించనున్నారు.

మైనింగ్ సిబ్బంది ఐక్యతే ప్రధాన లక్ష్యం:

ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రెండు రాష్ట్రాల డిప్యూటీ సెక్రటరీ పసునూటి రాజేందర్, డిప్యూటీ సెక్రటరీ రత్నం సమ్మిరెడ్డి, బ్రాంచి నాయకులు హుస్సేన్, కేంద్ర నాయకుడు నరేడ్ల సంపత్, పిట్ సెక్రటరీ పొనగంటి కృష్ణ, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు బాగోతుల కుమారస్వామి, రామారావు, వసంతరావు, ప్రకాష్, ఐఎన్టీయూసీ బ్రాంచి నాయకులు మండల శ్రీనివాస్, శ్రీపతి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మైనింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేయడం, కార్మికుల మధ్య ఐక్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గనుల్లో సిబ్బంది కొరత, విధుల సర్దుబాటు, బదిలీలు, ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.