
కార్మిక సంఘాల కార్యాలయాల కూల్చివేతను ఆపాలి.
రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదు.. 200 అడుగుల రోడ్డు ప్రతిపాదనపైనే అభ్యంతరం.
నోటీసులు లేకుండా కూల్చివేతలు చట్టవిరుద్ధం.. మున్సిపల్ అధికారులకు జేఏసీ హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 8: భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మిక సంఘాల కార్యాలయాలను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి, రోడ్డు విస్తరణకు కార్మిక సంఘాలు వ్యతిరేకం కాదని, అయితే ఇప్పటికే ఉన్న రహదారి విస్తరణకు మించి 200 అడుగుల రోడ్డు పేరుతో కార్మిక సంఘాల కార్యాలయాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. గురువారం భూపాలపల్లిలోని బీఎంఎస్ కార్యాలయ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.
బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ, భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించే విధంగా చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్మిక సంఘాల కార్యాలయాలు సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచడంతోపాటు కార్మికుల సమస్యలను పరిష్కరించుకునే వేదికలుగా ఉన్నాయని తెలిపారు. సింగరేణి యాజమాన్యం లీజు, అద్దె ఒప్పందాల ద్వారా సంఘాలకు కార్యాలయాలను కేటాయించిందని, వాటికి సంబంధించిన అద్దె, విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు కార్యాలయాలపైకి వచ్చి వాటి ఆవరణలను ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కార్యాలయాల కూల్చివేతకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూర్తిగా బాధ్యత వహించాలని జేఏసీ తరఫున డిమాండ్ చేశారు. నిజంగా ప్రాంత అభివృద్ధి చేయాలనుకుంటే రోడ్డు విస్తరణకు సంబంధించిన పూర్తి రోడ్‌మ్యాప్‌ను కార్మికులు, ప్రజల ముందు ఉంచాలని కోరారు. గతంలోనే రహదారి విస్తరణలో భాగంగా ఇరువైపులా భూమిని తీసుకుని సుమారు 100 అడుగుల మేర రహదారి అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు 200 అడుగుల రోడ్డు పేరుతో కార్యాలయాలను తొలగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కృష్ణకాలనీ వైపు 80 అడుగుల రోడ్డు, ప్రధాన రహదారిని 100 అడుగులుగా అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పారిశ్రామిక ప్రాంతంలో 200 అడుగుల రోడ్డు అవసరంపై అధికారులు పునరాలోచించాలని సూచించారు. మున్సిపల్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు, శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పాని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు కార్మిక సంఘాల జేఏసీ తరఫున ఇప్పటికే వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు అందుబాటులో లేకపోయినా వారి కార్యాలయాల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరామని, అయినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడటం సరికాదన్నారు. కార్యాలయాలకు సంబంధించి కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూల్చివేతలకు పాల్పడటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కూల్చివేతలకు సహకరించిన పోలీసులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్, చైర్మన్ తదితరులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్మిక సంఘాల కార్యాలయాలు, ఆస్తులను ధ్వంసం చేసే చర్యలు కొనసాగితే పారిశ్రామిక అశాంతి ఏర్పడే ప్రమాదం ఉందని, దాని ప్రభావానికి సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బ్రాంచ్ నాయకుడు దేవరకొండ మధు మాట్లాడుతూ, కార్మిక సంఘాల కార్యాలయాలు కార్మికులకు దేవాలయాల వంటివని అన్నారు. కార్మికుల చందాలతో రూపాయి రూపాయి కూడబెట్టి నిర్మించుకున్న కార్యాలయాలను కూల్చివేస్తుంటే కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శించారు. దసరా పండుగ నేపథ్యంలో చిన్న వ్యాపారులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేవరకొండ మధు తెలిపారు. కనీసం పండుగ పూర్తయ్యే వరకు కూల్చివేతలను నిలిపివేయాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. కార్మికులు, కార్మిక సంఘాలు, చిరు వ్యాపారులు ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు కామెర గట్టయ్య మాట్లాడుతూ, భూపాలపల్లి పట్టణంలో అభివృద్ధి పేరుతో ప్రజలను, చిరు వ్యాపారులను విభజించి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సింగరేణి కార్మిక సంఘాల కార్యాలయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. గతంలో ఉన్న రహదారి విస్తరణ ప్రతిపాదనలకు భిన్నంగా 200 అడుగుల రోడ్డు పేరుతో కార్యాలయాలను తొలగించడాన్ని ఆయన ప్రశ్నించారు. కార్మికులు తమ సమస్యలను ప్రశ్నించకుండా చేయడానికే కార్యాలయాలను తొలగిస్తున్నారనే అనుమానం కలుగుతోందని గట్టయ్య అన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, నిజంగా రోడ్డు విస్తరణ అవసరమైతే కార్మిక సంఘాలతో చర్చించి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి కార్యాలయాలను తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భవనాలను కూల్చివేయడం సరికాదన్నారు. కార్మిక సంఘాల మధ్య ఐక్యత అవసరమని, ఏఐటీయూసీతో సహా అన్ని సంఘాలు కలిసి కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడాలని గట్టయ్య పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల కార్యాలయాల కూల్చివేత విషయంలో ఏఐటీయూసీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలపై సంఘాలన్నీ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 200 అడుగుల రహదారి అవసరంపై ప్రభుత్వం, అధికారులు పునరాలోచించాలని ఆయన కోరారు. కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయం, కోర్టు తదితర ప్రాంతాల్లో అవసరమైన మేరకు రోడ్డు విస్తరణ చేపట్టవచ్చని, కార్మిక సంఘాల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. కార్మిక సంఘాల కార్యాలయాల జోలికి రావద్దని, కూల్చివేతల విధానాన్ని వెంటనే మార్చాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును డిమాండ్ చేశారు.
సమావేశంలో జేఏసీకి చెందిన పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని, కార్యాలయాల కూల్చివేతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.