
సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని కూల్చొద్దు : కామెర గట్టయ్య.
కార్మిక సంఘాల ప్రశ్నించే గొంతును అణచివేయొద్దు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జోక్యం చేసుకోవాలి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, అక్టోబర్ 8: తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని కూల్చివేయాలనే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. కార్మికులు, ప్రజలు, దళితులు, సామాజిక వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న తమ సంఘం కార్యాలయాన్ని కూల్చివేయడం సమంజసం కాదన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మికులు, ప్రజల హక్కుల పరిరక్షణకు ఒక కార్యాలయం అవసరమని భావించి, సింగరేణి యాజమాన్యంతో చర్చించి స్థలం తీసుకుని కార్యాలయాన్ని నిర్మించుకున్నామని గట్టయ్య తెలిపారు. గతంలోనూ అనేక ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ తమ సంఘం కార్యాలయంపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. అయితే ప్రస్తుతం రహదారి విస్తరణ పేరుతో కార్యాలయాన్ని కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో రహదారి నిర్మాణానికి ఇరువైపులా 140 అడుగుల మేర స్థలాన్ని పరిగణనలోకి తీసుకున్నారని, ప్రస్తుతం కార్యాలయానికి సమీపంగా రహదారి విస్తరణ చేపట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా కార్యాలయాన్ని కూల్చివేయనున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఈ విషయంపై ప్రజాప్రతినిధులను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని తెలిపారు. ఈ కార్యాలయంలోనే పలుమార్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో సమావేశాలు నిర్వహించామని, ఆయన ఎన్నిక సమయంలో తెలంగాణ జనసమితి, సింగరేణి ఉద్యోగుల సంఘం, ఇతర ప్రజాసంఘాలు కలిసి పనిచేశాయని గట్టయ్య గుర్తుచేశారు. ప్రస్తుతం అదే కార్యాలయాన్ని కూల్చివేసే పరిస్థితి రావడంపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఒకసారి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు ప్రశ్నించే గొంతులుగా ఉండాలని, వాటిని అణచివేసే ప్రయత్నాలు జరగకూడదని గట్టయ్య అన్నారు. ఈ సందర్భంగా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తమ సంఘం కార్యాలయ సమస్యపై ఇటీవల ఏఐటీయూసీ నాయకుడు మోటపలుకుల రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కార్మిక సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పరస్పరం ప్రశ్నించే హక్కును గౌరవించాలని అన్నారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కులు, ప్రజల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని గట్టయ్య స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కోరుకున్న నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ప్రతి ఒక్కరికీ గూడు, నీడ కల్పించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఆదివాసీలు, కార్మికులు, సామాన్య ప్రజల హక్కుల కోసం తమ సంఘం, ప్రజాసంఘాలు నిరంతరం పోరాడుతున్నాయని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సాంబశివరావు తదితరులు వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని గట్టయ్య కోరారు. తమ సంఘంపై, ప్రజాసంఘాలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా సమస్యలపై చర్చించాలని సూచించారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని కూల్చివేత నిర్ణయాన్ని పునఃపరిశీలించి, కార్మిక సంఘాల హక్కులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.