
‘సేవ్ మణుగూరు’ పిలుపుతో పట్టణ బంద్ విజయవంతం.
పీకే ఓసీ డిప్‌సైడ్ బ్లాక్‌ను ప్రైవేటీకరించవద్దని అఖిలపక్ష నేతల డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మణుగూరు, జూన్ 30:‘సేవ్ మణుగూరు’ పేరుతో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం మణుగూరు పట్టణ బంద్ విజయవంతంగా జరిగింది. బంద్‌కు వ్యాపార, వాణిజ్య, కార్మిక, విద్యా సంస్థలతో పాటు వివిధ వర్గాల ప్రజలు విస్తృతంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఐ నాయకుడు దుర్గ్యాల సుధాకర్, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి చలపతిరావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు రూపురెడ్డి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మణుగూరు ప్రాంత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పీకే ఓసీ డిప్‌సైడ్ బ్లాక్‌ను ప్రైవేటీకరించకుండా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే మణుగూరు ఓసీ విస్తరణకు అవసరమైన అనుమతులు వెంటనే తీసుకురావాలని కోరారు. మణుగూరు ప్రాంత అభివృద్ధి పూర్తిగా సింగరేణిపై ఆధారపడి ఉందని వారు పేర్కొన్నారు. 1974లో పీకే-1 ఇంక్లైన్ ప్రారంభమైన నాటి నుంచి పీకే-2, పీకే-3, ఓసీ-1, ఓసీ-2, ఓసీ-3, ఓసీ-4 వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందడంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించిందని తెలిపారు. సింగరేణి కార్యకలాపాల వల్లే పట్టణంలో వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు మరియు ఇతర రంగాలు అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. ప్రస్తుతం మణుగూరులో కేవలం రెండు గనులే పనిచేస్తున్నాయని, పీకే ఓసీ డిప్‌సైడ్ బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మరో 25 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాటిని వినియోగించేందుకు చర్యలు తీసుకోకుండా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం సరికాదన్నారు. బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు ప్రాంతంలో బీటీపీఎస్‌ను ఏర్పాటు చేసిందని, అయితే ప్రస్తుతం ఉన్న గనులకు అవసరమైన అనుమతులు తీసుకురావడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీకే ఓసీ డిప్‌సైడ్ బ్లాక్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘సేవ్ మణుగూరు’ ఉద్యమానికి మద్దతుగా చాంబర్ ఆఫ్ కామర్స్, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, కిరాణా, కూరగాయల, ఫ్యాన్సీ, చికెన్ అండ్ మటన్ మార్కెట్ సంఘాలు, హోటళ్లు, విద్యాసంస్థలు, వివిధ వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. పీవీ కాలనీలోనూ దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మణుగూరు ప్రాంత ప్రయోజనాలను కాపాడే నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, సీపీఐ మండల కార్యదర్శి జక్కుల రాజబాబు, సుజాత, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, తోట రమేష్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇమామ్ ఉద్దీన్, తేనేటి నారాయణ, ఎస్‌డీ ఉమర్, కొత్తపల్లి సీతారాములు, బోశెట్టి సంపత్, ఎస్‌కే సర్వర్, ఎస్వీ నాయుడు, ఆధర్ల రాములు, చిక్కుల శివ, కన్నెబోయిన ప్రసాద్, టీడీపీ నాయకులు మద్దెల భద్రయ్య, తాటి పూర్ణచంద్రరావు, రాజా, ఆంజనేయులు, జంపాల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.