జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం:12వ వేజ్ బోర్డు, లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో వేలాది కార్మికుల మహాధర్నా.


సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది.
జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.
12వ వేజ్ బోర్డు, లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో వేలాది కార్మికుల మహాధర్నా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 1:సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన మహాధర్నా, ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. సింగరేణి అన్ని ఏరియాల నుంచి వేలాదిమంది కార్మికులు, నాయకులు తరలివచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలపడంతో కొత్తగూడెం మరోసారి పోరాట నినాదాలతో మార్మోగింది. ఎఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో “డిమాండ్ల డే”గా నిర్వహించిన ఈ కార్యక్రమం సింగరేణి కార్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. 12వ వేజ్ బోర్డు ఏర్పాటు, వేతన సవరణ అమలు, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు తదితర డిమాండ్లతో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. కార్మికుల సహనాన్ని బలహీనతగా భావిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించి వేతన సవరణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మిక హక్కులను దెబ్బతీసే నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. డిమాండ్ల పరిష్కారంలో జాప్యం కొనసాగితే దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని స్పష్టం చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్న పాలకులు, యాజమాన్యం అదే కార్మికులకు రావాల్సిన హక్కులను నిరాకరించడం బాధాకరమన్నారు. లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెలు, ముట్టడులు, నిరవధిక ఆందోళనలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సింగరేణి చరిత్రలో కార్మికులకు లభించిన ప్రతి హక్కు ఉద్యమాల ద్వారానే సాధ్యమైందని గుర్తుచేస్తూ, ఈసారి కూడా కార్మికుల ఐక్యతతో విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. “12వ వేజ్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి”, “నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి” అనే నినాదాలతో హెడ్ ఆఫీస్ పరిసరాలు మార్మోగాయి. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమ జ్వాల ఆరదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె. సారయ్య, వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శులు మల్లికార్జున్, రమణమూర్తి, నజీర్, మేకల ఈశ్వర్, సుధాకర్, గట్టయ్య, ఐఎన్‌టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, త్యాగరాజన్, లక్ష్మారెడ్డి, ఆల్బర్ట్, పీఠంబరం, రజాక్, సీఐటీయూ నాయకులు మంద నర్సింహారావు, రాజిరెడ్డి, విజయగిరి శ్రీనివాస్, హెచ్‌ఎంఎస్ నాయకులు కృష్ణప్రసాద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్మికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.