సింగరేణిలో 39 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు.
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు కుప్పారపు వీరభద్రం ఉద్యోగ విరమణ.
సహోద్యోగులు, అధికారులు ఘనంగా సన్మానం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 30:సింగరేణి సంస్థలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అంకితభావంతో సేవలందించిన ట్రాన్స్పోర్ట్ విభాగం ఉద్యోగి, జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు కుప్పారపు వీరభద్రం మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనకు సింగరేణి కార్పొరేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో 39 సంవత్సరాల పాటు డ్రైవర్గా విధులు నిర్వహించిన వీరభద్రం, ఉన్నతాధికారులు, డైరెక్టర్ల వద్ద నిబద్ధతతో సేవలందించి మంచి గుర్తింపు పొందారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడారంగంలోనూ ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయిలో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా వీరభద్రం, ఆయన సతీమణి నిర్మల దంపతులను ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు, సహోద్యోగులు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ రామనాథం, డైరెక్టర్ (పీపీ) కార్యాలయం ఎస్వో లక్ష్మీనారాయణ, సింగరేణి ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని వీరభద్రం దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో పాటు క్రీడారంగంలోనూ విశిష్ట ప్రతిభ కనబరిచిన వీరభద్రం యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.