రెండు నెలల పాటు సింగరేణి అధికారుల ఆందోళనలకు విరామం.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిర్ణయం.
గడువులోపు పరిష్కారం లేకుంటే ఉద్యమం. పునఃప్రారంభిస్తామని హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 13: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల హామీ ఇవ్వడంతో గత 15 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు రెండు నెలల పాటు విరామం ఇవ్వాలని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి శాఖ నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం సింగరేణి అధికారుల సమస్యలను రెండు నుంచి మూడు నెలల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సీఎంఓఏఐ సింగరేణి శాఖ సభ్యులకు విడుదల చేసిన ప్రకటనలో, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇంతకాలం ఐక్యంగా, క్రమశిక్షణతో ఉద్యమాన్ని విజయవంతం చేసిన ప్రతి అధికారికి సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం, యాజమాన్యం సానుకూలంగా స్పందించి రెండు నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని గౌరవిస్తూ తమ నిరసన కార్యక్రమాలను రెండు నెలల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సంఘం వెల్లడించింది. ఈ గడువులో సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ నిర్ణీత సమయంలో హామీలు అమలు కాకపోతే సభ్యులతో సంప్రదించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కోల్బెల్ట్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపిన నాయకులు, మీడియా ప్రతినిధులు, సింగరేణి అధికారులందరికీ సీఎంఓఏఐ సింగరేణి శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కాగా రిలే నిరాహార దీక్షల ఉపసంహరణ విషయంపై సిఎంఓఏఐ సింగరేణి శాఖ ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులును సంప్రదించగా, ఉప ముఖ్యమంత్రి హామీ మేరకు దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు.
గత 15 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా అధికారులు ప్రమోషన్ పాలసీ, వేతన సంబంధిత అంశాలు, వీఆర్సీ, పీఆర్పీతో పాటు ఇతర పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ హామీ నేపథ్యంలో తాత్కాలికంగా ఆందోళనలను నిలిపివేస్తున్నప్పటికీ, హామీలు అమలు కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా కొనసాగిస్తామని సంఘం హెచ్చరించింది.