Take a fresh look at your lifestyle.

సింగరేణి వ్యాప్తంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘సింగరేణి భరోసా యాత్ర’ : ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పర్యటన.

0 35

సింగరేణి వ్యాప్తంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘సింగరేణి భరోసా యాత్ర’
తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో రెండు రోజుల పర్యటన.
కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం, మంచిర్యాలలో కార్మికులతో ముఖాముఖి.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 11: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 13, 14 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా ‘సింగరేణి భరోసా యాత్ర’ చేపట్టనున్నారు. ఇటీవల జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను వేలం నిర్వహించకుండా సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలు, కార్మిక వర్గంలో నెలకొన్న చర్చల మధ్య కేంద్ర మంత్రి స్వయంగా బొగ్గు గనుల ప్రాంతాలను సందర్శించి కార్మికులతో నేరుగా మాట్లాడనుండటం రాజకీయ, కార్మిక వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తున్న తరుణంలో బీజేపీ కూడా ‘సింగరేణి భరోసా యాత్ర’కు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుతో కేంద్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉందనే సందేశాన్ని కార్మికులకు చేరవేయడంతో పాటు, బీజేపీ, బీఎంఎస్‌పై జరుగుతున్న విమర్శలకు సమాధానం ఇవ్వడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొననున్నారు.
పర్యటన షెడ్యూల్:
జూలై 13 (సోమవారం):
ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి తొలుత కొత్తగూడెంలో హాల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మణుగూరులోని పీకే ఓసీ-2 గనిని సందర్శించి కార్మికులతో గేట్ సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం భూపాలపల్లిలో హాల్ సమావేశంలో పాల్గొని అక్కడే రాత్రి బస చేస్తారు.
జూలై 14 (మంగళవారం):
ఉదయం భూపాలపల్లి కేటీకే-8 గనిలో కార్మికులతో గేట్ సమావేశం నిర్వహించిన అనంతరం తాడిచర్ల బొగ్గు గనులను సందర్శిస్తారు. తరువాత రామగుండంలోని జీడీకే ఓసీ గని, మంచిర్యాలలోని ఎస్‌ఆర్‌పీ-3 గనులను సందర్శించి కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం క్యాతనపల్లిలో హాల్ సమావేశంలో పాల్గొని సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఈ పర్యటనకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. రఘునాథ్ రావు సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతమ్ రావు అధికారికంగా పర్యటన వివరాలను శనివారం విడుదల చేశారు.

Leave A Reply

Your email address will not be published.