
సింగరేణిని బంగారు బాతుగా మార్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ దోపిడీ చేశాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
తాడిచర్ల-2 బొగ్గు బ్లాకు కేటాయింపు మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 13: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణం చోటుచేసుకుందని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుని సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన “సింగరేణి భరోసా యాత్ర”లో భాగంగా సోమవారం కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వేలం ప్రక్రియకు వెళ్లకుండా తాడిచర్ల-2 బొగ్గు బ్లాకును ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా సింగరేణికి కేటాయించిందని పేర్కొన్నారు. ఇది సింగరేణి కార్మికులపై, తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ప్రేమకు నిదర్శనమని అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని అభివృద్ధి చేయడం మానేసి, రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించిందని ఆరోపించారు. దేశంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని కొత్త బ్లాకులు సంపాదించుకున్నప్పటికీ, సింగరేణి కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని విమర్శించారు. తాను తెలంగాణకు చెందిన వ్యక్తిగా సింగరేణి సమస్యలను పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లానని, దాని ఫలితంగానే తాడిచర్ల-2 బ్లాకు సింగరేణికి లభించిందని చెప్పారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సింగరేణి గడ్డపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
“సింగరేణిని బంగారు బాతుగా మార్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు దోపిడీ చేశాయి. ఒకప్పుడు సింగరేణి నిధులు సిద్దిపేటకు వెళ్లాయని, ఇప్పుడు కొడంగల్‌కు మళ్లుతున్నాయి. సింగరేణితో రాజకీయ ఫుట్‌బాల్ ఆడారు. సంస్థ సంపదను కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాల్సింది పోయి రాజకీయ అవసరాలకు ఉపయోగించారు” అంటూ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ, సంస్థ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లో కేంద్రాన్ని భాగస్వామిగా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరించాయని అన్నారు. గతంలో సింగరేణి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే సంస్థను ఆదుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సింగరేణి బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణ, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.