సింగరేణి బొగ్గు నాణ్యతపై రాజీ లేదు.
ఉత్పత్తి నుంచి డిస్పాచ్ వరకు ప్రత్యేక పర్యవేక్షణ.
ఏరియాల వారీగా స్పెషల్ అధికారుల నియామకం.
నాణ్యమైన బొగ్గు సరఫరాపై సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాలు.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 18:సింగరేణి బొగ్గు నాణ్యతే సంస్థకు గుర్తింపని, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగా నాణ్యమైన బొగ్గు సరఫరాలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని సింగరేణి సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తితో పాటు నాణ్యతను కాపాడేందుకు ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం స్థానిక సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి, గ్రేడ్ పరిరక్షణ, నాణ్యత, డిస్పాచ్ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎండీ, రానున్న మూడు నెలల పాటు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ఏరియాల్లో ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ నియంత్రణ, డిస్పాచ్, ఉత్పాదకత, కార్పొరేట్–ఏరియా సమన్వయం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు డైరెక్టర్ (ఆపరేషన్స్)కు సత్తుపల్లి, ఇల్లందు ఏరియాలు, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)కు మణుగూరు, భూపాలపల్లి, డైరెక్టర్ (ఫైనాన్స్)కు బెల్లంపల్లి, మందమర్రి, డైరెక్టర్ (ఈ అండ్ ఎం)కు ఆర్జీ–1, ఆర్జీ–3, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్)కు ఆర్జీ–2, నైనీ, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)కు శ్రీరాంపూర్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. కొన్ని ఏరియాల్లో అన్‌గ్రేడెడ్ బొగ్గు, షేల్ కలవడం వల్ల నాణ్యత తగ్గుతోందని అధికారులు వివరించగా, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు. వార్షిక కోల్ గ్రేడేషన్ ప్రణాళిక ప్రకారం సీమ్‌ల వారీగా తవ్వకాలు నిర్వహించి, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగానే బొగ్గు ఉత్పత్తి జరగాలని సూచించారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్‌కు ముందు బొగ్గు బెంచీలను పూర్తిగా శుభ్రం చేయాలని, రాయి, షేల్‌ను బొగ్గుతో కలపకుండా వేరుగా తవ్వి ఓవర్‌బర్డెన్‌లోనే డంప్ చేయాలని ఆదేశించారు. ఫైరీ కోల్ నిర్వహణ, గ్యాలరీల శుభ్రతకు రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ)ను అన్ని ఏరియాల్లో కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని ఓపెన్‌కాస్ట్ గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో క్రషర్లు సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి ప్లాంట్‌లో రోజువారీ గ్రేడ్‌వారీ డిస్పాచ్ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఉత్పత్తి నుంచి డిస్పాచ్ వరకు ప్రతి దశలో నాణ్యత నియంత్రణకు అధికారులు వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. సింగరేణి బొగ్గుపై వినియోగదారులకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి అధికారి బాధ్యత అని, నాణ్యమైన బొగ్గు సరఫరా ద్వారా సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచాలని డా. బుద్దప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు. ఈ సమీక్షలో సంస్థ డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), ఎం. తిరుమలరావు (ఈ అండ్ ఎం), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.