ఉద్యోగానికే రిటైర్మెంట్.. సేవకు కాదు : మల్లికార్జున్ పదవీ విరమణ సన్మాన సభలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.

ఉద్యోగానికే రిటైర్మెంట్.. సేవకు కాదు.
సింగరేణి కార్మిక నాయకుడు పి. మల్లికార్జున్ సేవలు ప్రశంసనీయం.
పదవీ విరమణ సన్మాన సభలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.
కార్మికుల సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జూలై 31:ఉద్యోగ జీవితానికి మాత్రమే రిటైర్మెంట్ ఉంటుందని, ప్రజాసేవకు, కార్మికుల సేవకు ఎప్పటికీ విరామం ఉండదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణి ఆర్జీ-1 డివిజన్ పరిధిలోని జీడీకే-11 (11-ఎ) ఇంక్లైన్ గనిలో ఉద్యోగిగా విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ పొందిన శ్రమశక్తి అవార్డు గ్రహీత, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కార్మిక నాయకుడు పి. మల్లికార్జున్ కు సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఘన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంత్రి మల్లికార్జున్ దంపతులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ బి. వెంకట్రావు, కాంగ్రెస్ నాయకుడు, ఎన్టీపీసీ నేషనల్ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీం పాషాతో కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మల్లికార్జున్ ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఉద్యోగంలో క్రమశిక్షణ, నిజాయితీతో పాటు కార్మిక సంఘ నాయకుడిగా సహోద్యోగుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని చెప్పారు. కార్మిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ఆయన సేవలు అందించారని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి కాలం నుంచి మల్లికార్జున్ తమ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ తనకు, ఎంపీ వంశీకృష్ణకు విలువైన సూచనలు అందించేవారని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ ఉంటుందని, ఇకపై కూడా ప్రజాసేవ, కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా కొనసాగాలని సూచించారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మల్లికార్జున్ సింగరేణి ఉద్యోగిగా సమర్థవంతంగా విధులు నిర్వహించడమే కాకుండా కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కార్మిక హక్కుల పరిరక్షణకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. పదవీ విరమణ ఉద్యోగానికే పరిమితమని, ప్రజాసేవకు మాత్రం ఎలాంటి విరామం ఉండదని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జీడీకే-11 గనిలో కొలువై ఉన్న మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గని కార్మికులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
సన్మానానికి స్పందించిన పి. మల్లికార్జున్ తనకు ఈ గౌరవం అందించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్సీ బి. వెంకట్రావు, నాయకులు, సహచర ఉద్యోగులు, కార్మికులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం కూడా కార్మికుల సంక్షేమం, ప్రజాసేవలో కొనసాగుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహాంకాళి స్వామి, మాజీ ఎమ్మెల్సీ బి. వెంకట్రావు, కాంగ్రెస్ నాయకుడు బాబర్ సలీం పాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, గని మేనేజర్ జాన్సన్, ఫిట్ ఇంజినీర్ శ్రీనివాస్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాధవరావు, పి. శ్యాంసుందర్, దయానంద్ గాంధీ, కెఎస్ వాసు, డి. శంకర్, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ కె. రాజేందర్, బంక రామస్వామి, డాక్టర్ రాజేంద్రకుమార్, ఎం. సారయ్య, గంగాధర్, లయన్స్ క్లబ్ రాయల్ అధ్యక్షుడు బాలసాని కొమురయ్య, కార్యదర్శి యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కామ విజయ్, తిప్పారపు మధు, అనుమాస శ్రీనివాస్, ఎండి సజ్జద్, కార్మిక సంఘాల ప్రతినిధులు, గనిలోని వివిధ షిఫ్టులకు చెందిన కార్మికులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మల్లికార్జున్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు.