Take a fresh look at your lifestyle.

కొత్త గనులే సింగరేణి భవిష్యత్తుకు భరోసా : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.

0 3

కొత్త గనులే సింగరేణి భవిష్యత్తుకు భరోసా : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి – కొత్త కోల్ బ్లాకుల సాధనకు నిరంతర కృషి.
కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు, మెడికల్ బోర్డు, సొంతింటి కలపై త్వరలో సీఎం స్థాయిలో సమావేశం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జూలై 31:సింగరేణి సంస్థ దీర్ఘకాలిక మనుగడకు కొత్త బొగ్గు గనుల కేటాయింపే కీలకమని, ఆ లక్ష్యంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూ కొత్త కోల్ బ్లాకుల సాధనకు కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణి విస్తరణ, ఉత్పత్తి పెంపు, కార్మిక సంక్షేమం అనే మూడు అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీడీకే–11 గనిలో రాష్ట్ర ప్రభుత్వ ‘శ్రమశక్తి’ అవార్డు గ్రహీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. మల్లికార్జున్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో శుక్రవారం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాకుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పాల్గొనకపోవడం వల్ల సింగరేణికి ఒక్క కొత్త కోల్ బ్లాక్ కూడా దక్కలేదని విమర్శించారు. దీంతో సంస్థ భవిష్యత్తుపై కార్మికుల్లో అభద్రతాభావం నెలకొనడంతో పాటు, సంస్థ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని పేర్కొన్న మంత్రి, మంచిర్యాల జిల్లాలో ఆర్‌కే ఓపెన్‌కాస్ట్ గని ప్రారంభానికి మార్గం సుగమమైందని, దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర కృషి, ఒత్తిడి ఫలితంగా తాడిచర్ల బ్లాక్–2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని చెప్పారు. సత్తుపల్లి, కోయగూడెం ప్రాంతాల్లోని డిప్‌సైడ్ కోల్ బ్లాకులు ప్రైవేటు కంపెనీలకు వెళ్లడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ఇప్పటికీ ఆ బ్లాకుల్లో ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వాటిని కూడా తిరిగి సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని తెలిపారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న మరిన్ని బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కేలా భవిష్యత్తులో నిర్వహించే వేలాల్లో సంస్థ చురుకుగా పాల్గొంటుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఏడాదికి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో కొనసాగుతున్న సింగరేణి, త్వరలోనే 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉత్పత్తి పెరిగితే సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు కార్మికులకు అధిక బోనస్, మెరుగైన సంక్షేమ ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుందని వివరించారు. కార్మిక సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్న మంత్రి, గత పదేళ్లలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు, సీఐఐ ప్రతినిధులతో చర్చలు జరిపి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుకు చర్యలు తీసుకున్నామని, ఇది రాష్ట్ర కార్మిక చరిత్రలో ఒక ముఖ్యమైన నిర్ణయమని అన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు, శాశ్వత ఉద్యోగుల సొంతింటి కల సాకారం, మెడికల్ బోర్డు నిర్వహణతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర కార్మిక సమస్యల పరిష్కారంపై త్వరలోనే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.