Take a fresh look at your lifestyle.

సింగరేణి మైనింగ్‌ స్టాఫ్‌ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి : మైనింగ్ సిబ్బంది.

0 2

సింగరేణి మైనింగ్‌ స్టాఫ్‌ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి.
కోల్‌ ఇండియా తరహా ప్రమోషన్‌ పాలసీ అమలు చేయాలి.
డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు వెనుకాడం: మైనింగ్‌ స్టాఫ్‌ హెచ్చరిక.
భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ కు వినతిపత్రం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్‌-భూపాలపల్లి, ఆగస్టు 26: సింగరేణి మైనింగ్‌ స్టాఫ్‌ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కోల్‌ ఇండియా తరహాలో ప్రమోషన్‌ పాలసీని అమలు చేయాలని మైనింగ్‌ స్టాఫ్‌ డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం భూపాలపల్లి ఏరియా మైనింగ్‌ స్టాఫ్‌ ఆధ్వర్యంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామసుందర్  కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైనింగ్‌ స్టాఫ్‌ బాధ్యుడు ఎ. రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతర బొగ్గు ఉత్పత్తికి, కఠినమైన భద్రతా ప్రమాణాల అమలుకు కృషి చేస్తున్న మైనింగ్‌ స్టాఫ్‌ సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కోల్‌ ఇండియా తరహా ప్రమోషన్లు: అర్హులైన ఎన్‌సీడబ్ల్యూఏ టెక్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌ స్టాఫ్‌ అందరికీ ఈ-2 అండర్‌ మేనేజర్‌ ప్రమోషన్లు కల్పించాలని, 2016, 2017 జేఎంఈటీ బ్యాచ్‌లోని 470 మందికి పైగా అర్హులైన అభ్యర్థులకు బ్యాక్‌డేట్‌తో ప్రమోషన్లు మంజూరు చేయాలని, వైద్యపరంగా అన్‌ఫిట్‌ అయిన మైనింగ్‌ స్టాఫ్‌కు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని,
ప్రొఫెషనల్‌ డిగ్రీలు, ఉన్నత సాంకేతిక విద్య అభ్యసించేందుకు ఎన్‌ఓసీ పాలసీ అమలు చేయాలి. ఎక్స్‌టర్నల్‌ అండర్‌ మేనేజర్ల నోటిఫికేషన్‌ రద్దు చేసి అంతర్గత అభ్యర్థుల ప్రమోషన్‌, సెలక్షన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, 2024 ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ జేఎంఈటీ బ్యాచ్‌లకు అనుకూలంగా ప్రమోషన్‌ పాలసీ రూపొందించాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు.
నేడు సింగరేణి భవన్ వద్ద నిరసన:
ఆగస్టు 24, 25 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, మైన్‌ మేనేజర్లు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఆగస్టు 26న నల్ల బ్యాడ్జీలతో జీఎం కార్యాలయాల వద్ద నినాదాలు చేస్తూ వినతిపత్రాలు అందజేశారు. ఆగస్టు 27న హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద ఉదయం 10 గంటలకు శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే సమ్మెకు వెళ్లక తప్పదని మైనింగ్‌ స్టాఫ్‌ హెచ్చరించారు. అటువంటి పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా భద్రత, బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్‌ స్టాఫ్‌ సభ్యులు రఘుపతిరెడ్డి, భరత్‌కుమార్‌, సంపత్‌రెడ్డి, ఏడుకొండలు, శ్రీకాంత్‌, సంపత్‌, నరేష్‌, ఆసిఫ్‌ పాషా, సధయ్య, ప్రసన్నకుమార్‌, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.