
షోయబుల్లా ఖాన్ సేవలు చిరస్మరణీయం.
కొత్తగూడెం ప్రెస్ క్లబ్లో ఘనంగా వర్ధంతి వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 22: ప్రముఖ జర్నలిస్టు, అమరుడు షోయబుల్లా ఖాన్ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు జర్నలిస్టులు కొనియాడారు. కొత్తగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం షోయబుల్లా ఖాన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన షోయబుల్లా ఖాన్ చిత్రపటానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పాత్రికేయ జీవితాన్ని, ప్రజా సమస్యలపై ఆయన పోరాటాన్ని, వృత్తిపట్ల చూపిన నిబద్ధతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను నిర్భయంగా వెల్లడించడంలో షోయబుల్లా ఖాన్ చూపిన ధైర్యం, నిబద్ధత నేటి పాత్రికేయులకు స్ఫూర్తిదాయకమన్నారు. అధికార ఒత్తిళ్లకు, బెదిరింపులకు వెరవకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ఆయన పాత్రికేయ జీవితానికి ప్రత్యేకతను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, వాస్తవాలను ప్రజల ముందుంచిన ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. ప్రజల హక్కులు, సమస్యలపై నిరంతరం స్పందిస్తూ నిజాయితీతో జర్నలిజాన్ని కొనసాగించిన షోయబుల్లా ఖాన్కు నివాళి అర్పించాలంటే నేటి జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి స్టాఫర్ గోవింద్, ఐ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్, వెలుగు స్టాఫర్ రాజేందర్, మన తెలంగాణ స్టాఫర్ సత్య ప్రకాష్, విజన్ ఆంధ్ర స్టాఫర్ ఉమాకాంత్, ఉదయం స్టాఫర్ జీవన్, సీనియర్ పాత్రికేయులు లోగాని శ్రీనివాస్, మోటమర్రి రామకృష్ణ, జునుమాల రమేష్, రేశ్వంత్ పండుగ, రిపోర్టర్లు ఏర్పుల సుధాకర్, కొండా జంపన్న, కవటం శ్రీనివాస్, కోల కుమార్, బిగ్ టీవీ నాగేశ్వరరావు, సీవీఆర్ రమేష్, అఫ్జల్ పఠాన్ తదితరులు పాల్గొని షోయబుల్లా ఖాన్ సేవలను స్మరించుకున్నారు.