
టెండర్లు, సోలార్ ప్రాజెక్టులు, బొగ్గు నిల్వలపై సమగ్ర విచారణ జరపాలి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.
సింగరేణిలో వేల కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణ.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 3: సింగరేణి సంస్థలో ఓబీ టెండర్లు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు నిల్వలు, కారుణ్య నియామకాలు, గురుకుల టెండర్లలో వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవహారాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, గత రెండు మూడు నెలలుగా సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, అవినీతిపై బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రెండు నెలల తర్వాత స్పందించినప్పటికీ అసలు ఆరోపణలపై సమాధానం చెప్పకుండా దారి మళ్లించే ప్రయత్నం చేశారని విమర్శించారు.
ఓబీ టెండర్లలో అక్రమాలు:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “సైట్ విజిట్ సర్టిఫికేట్” పేరుతో కొత్త నిబంధనను తీసుకొచ్చి ఓబీ టెండర్లలో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్లస్ టెండర్లుగా ఉన్న పనులు ఇప్పుడు మైనస్ టెండర్లుగా మారి సింగరేణికి వందల కోట్ల రూపాయల నష్టం కలిగించాయని అన్నారు. ముఖ్యమంత్రి బంధువులకు చెందిన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి సుమారు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
నైనీ బొగ్గు బ్లాక్‌పై ప్రశ్నలు:
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్‌ను మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని, అదే విధంగా మిగిలిన తొమ్మిది టెండర్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సోలార్ ప్రాజెక్టుల్లో రూ.480 కోట్ల కుంభకోణం:
సాధారణంగా ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం రూ.3 నుంచి రూ.3.5 కోట్ల మధ్య ఉంటుందని, సింగరేణిలో భూమి ఉచితంగా లభించినప్పటికీ ఒక్కో మెగావాట్‌కు రూ.7 కోట్ల చొప్పున టెండర్లు కేటాయించారని ఆరోపించారు. 67 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా రూ.280 కోట్లు, 107 మెగావాట్ల ప్రాజెక్టు ద్వారా మరో రూ.200 కోట్లు అదనంగా కాంట్రాక్టర్లకు చెల్లించి మొత్తం రూ.480 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
పవర్ ప్లాంట్లపై విమర్శలు:
కేసీఆర్ హయాంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ విజయవంతంగా నిర్మించామని గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మరో 800 మెగావాట్ల ప్లాంట్ కోసం రూ.8,000 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచినా, డీపీఆర్, పీపీఏ లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. రామగుండంలో ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రాజస్థాన్ ప్రభుత్వంతో 76:24 నిష్పత్తిలో జాయింట్ వెంచర్ పేరుతో జైసల్మేర్‌లో 1,400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక కమిషన్ల కోణం ఉందని విమర్శించారు.
బొగ్గు నిల్వల్లో రూ.1,600 కోట్ల స్కాం:
సింగరేణి వెబ్సైట్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నప్పటికీ, వాస్తవంగా అంత నిల్వలు లేవని హరీశ్ రావు గుర్తించారని తెలిపారు. లేని బొగ్గును ఉన్నట్లు చూపించి కోల్ సెస్, డీఎంఎఫ్టీ, డివిడెండ్ల రూపంలో ప్రభుత్వాలకు చెల్లింపులు జరిపి సంస్థకు సుమారు రూ.1,600 కోట్ల నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ అక్రమాలను వ్యతిరేకించిన జి.వి.రెడ్డి, కె.వి.శ్రీనివాస్ వంటి నిజాయితీ గల అధికారులను బదిలీలు, వీఆర్ఎస్ల ద్వారా వేధించారని పేర్కొన్నారు.
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ఆందోళన:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.19,733 కోట్లకు చేరాయని తెలిపారు. గతంలో రూ.7,355 కోట్లు ఉండగా, ఈ కాలంలోనే అదనంగా రూ.12,377 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఓడీ పరిమితి రూ.3,200 కోట్లు ఉండగా, సింగరేణి ఓడీ రూ.4,300 కోట్లకు చేరిందన్నారు. 2023-24, 2024-25 సంవత్సరాల్లో రూ.6,315 కోట్ల లాభాలు వచ్చినప్పటికీ, అందులో రూ.4,300 కోట్లను అభివృద్ధి పేరుతో పక్కన పెట్టి ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు బ్యాంకుల నుంచి ఓడీ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.
కారుణ్య నియామకాలపై విమర్శలు:
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని పునరుద్ధరించి 16 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తోందన్నారు. గత పది నెలల్లో కేవలం మూడు మెడికల్ బోర్డులు మాత్రమే నిర్వహించి, కొద్దిమందినే మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించారని విమర్శించారు. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం వచ్చినవారు, తీవ్ర ప్రమాదాలకు గురైన వారిని కూడా విధులకు ఫిట్‌గా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒత్తిడి వల్లే రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 335 మంది మెడికల్ అన్‌ఫిట్ వారసులకు ప్రభుత్వం ఇటీవల నియామక పత్రాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
గురుకుల టెండర్లలోనూ అక్రమాలు:
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 1,023 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందించామని తెలిపారు. చేనేత కార్మికులు, చర్మకారులు, ఎస్సీ, ఎస్టీ సహకార సంఘాలకు గురుకులాల సరఫరా ఆర్డర్లు ఇవ్వాలనే జీఓలను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా నిబంధనలు మార్చి గుజరాత్‌కు చెందిన “మఫత్‌లాల్” కంపెనీకి రూ.1,800 నుంచి రూ.2,000 కోట్ల విలువైన టెండర్లు కట్టబెట్టి స్థానిక చేనేత, చర్మకారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ఈ వ్యవహారాలన్నింటికీ సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అందుకే ప్రభుత్వం భయపడి తమను తెలంగాణ భవన్లో గృహనిర్బంధం చేసిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తమ ఆరోపణలు తప్పని నిరూపించే ధైర్యం ప్రభుత్వానికి ఉంటే బహిరంగ చర్చకు రావాలని, ప్రజాక్షేత్రంలో అన్ని విషయాలపై సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.