సింగరేణి మైనింగ్ స్టాఫ్ సమస్యలపై ఐక్య పోరాటం.
కోల్ ఇండియా తరహాలో ప్రమోషన్లు కల్పించాలి.
ఓసీపీ-3 మేనేజర్లకు మెమోరాండం.. స్పందించకపోతే సమ్మెకు సిద్ధం.
హైదరాబాద్‌లో నిరసన చేపడతామని మైనింగ్ స్టాఫ్ హెచ్చరిక.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి , ఆగస్టు 25:సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, కోల్ ఇండియాలో అమలవుతున్న విధానాల తరహాలో అర్హత కలిగిన మైనింగ్ స్టాఫ్‌కు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మైనింగ్ స్టాఫ్ ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సింగరేణి భూపాలపల్లి కేటీకే-ఓసీపీ-3 మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కేటీకే-ఓసీపీ-3 ప్రాజెక్ట్ మేనేజర్ రాంబాబు, కేటీకే-ఓసీపీ-3 (యూజీ) ప్రాజెక్ట్ మేనేజర్ సునీల్ కుమార్‌కు మెమోరాండం సమర్పించారు. మైనింగ్ స్టాఫ్ ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి రక్షణ, ఉత్పత్తి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మైనింగ్ స్టాఫ్ హక్కులు, సమస్యలను యాజమాన్యం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు ప్రమోషన్లలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో అమలవుతున్న విధానాల తరహాలోనే అర్హత కలిగిన ఎన్‌సీడబ్ల్యూఏ టెక్నికల్, సూపర్‌వైజరీ గ్రేడ్ సిబ్బందికి ఈ-2 అండర్ మేనేజర్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 2016, 2017 జేఎంఈటీ బ్యాచ్‌లలోని అర్హత కలిగిన 470 మందికి పైగా అభ్యర్థులకు తక్షణమే బ్యాక్‌డేట్‌తో ప్రమోషన్లు మంజూరు చేయాలని కోరారు. మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన మైనింగ్ సిబ్బందికి వారి అర్హతలకు అనుగుణంగా తగిన ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది ఉన్నత సాంకేతిక విద్య, ప్రొఫెషనల్ డిగ్రీలు అభ్యసించేందుకు వీలుగా ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎక్స్‌టర్నల్ అండర్ మేనేజర్ నోటిఫికేషన్లను రద్దు చేసి, సంస్థలో పనిచేస్తున్న అంతర్గత అభ్యర్థుల ప్రమోషన్, ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024 ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ జేఎంఈటీ బ్యాచ్‌ల కోసం క్యాడర్ స్కీమ్‌ను సడలించి, మెరుగైన, అనుకూలమైన ప్రమోషన్ విధానాన్ని రూపొందించాలని కోరారు. యాజమాన్యం తమ డిమాండ్లపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు. లేనిపక్షంలో మైనింగ్ స్టాఫ్ సమ్మెకు వెళ్లడం తప్పదని హెచ్చరించారు. సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే సింగరేణి భద్రత, ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించి, అర్హులైన సిబ్బందికి ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత, ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కేటికే ఓసీపీ-3 మైనింగ్ స్టాఫ్ నల్లేలా సురేష్, సదయ్య, వెంకటస్వామి, కృష్ణమూర్తి, శ్రీనివాస్, నరేందర్, మహేష్, శ్రీకాంత్, ప్రేమ్‌చంద్, సాయి ప్రసన్న, రవిశంకర్, మల్లిఖార్జున్ , గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.