Take a fresh look at your lifestyle.

కొత్తగూడెంలో షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులపై సమగ్ర విచారణ.

0 5

షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులపై సమగ్ర విచారణ.

40 కేసులపై రికార్డులు పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 25: షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. గిరిజనుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను నిబంధనల మేరకు పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం భద్రాద్రి ఐడీఓసీ కలెక్టరేట్ కార్యాలయంలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసులపై కమిషన్ సభ్యుడు సమగ్ర విచారణ నిర్వహించారు. కమిషన్‌కు అందిన ఫిర్యాదులపై ఫిర్యాదుదారులు, సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మొత్తం 40 కేసులను విచారణకు స్వీకరించి, వాటికి సంబంధించిన రికార్డులు, నివేదికలను పరిశీలించారు. కేసుల వారీగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న జాటోత్ హుస్సేన్, ఆయా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. షెడ్యూల్డ్ తెగల సమస్యలను నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజనుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. విచారణ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు ఆయా కేసులకు సంబంధించిన రికార్డులు, నివేదికలను కమిషన్ సభ్యుడికి సమర్పించి వివరాలను వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.