సమిష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి.
భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి
ఆగస్టు నెలలో భూపాలపల్లి ఏరియాలో 43 శాతం బొగ్గు ఉత్పత్తి, రవాణా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 1: భూపాలపల్లి ఏరియాలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఉత్పత్తి పెంపుతో పాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు నెలలో భూపాలపల్లి ఏరియాకు 3.73 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా, 1.60 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా సాధించినట్లు జీఎం తెలిపారు. ఇది 43 శాతం లక్ష్య సాధనగా నమోదైందని, రోజువారీ సగటు ఉత్పత్తి 5,157 టన్నులుగా ఉందన్నారు. ఓబీ తొలగింపులో కేటీకే ఓసీ-2కు 10.03 లక్షల ఘనపు మీటర్ల లక్ష్యానికి 8.66 లక్షల ఘనపు మీటర్లు (86 శాతం), కేటీకే ఓసీ-3కు 10.40 లక్షల ఘనపు మీటర్ల లక్ష్యానికి 13.02 లక్షల ఘనపు మీటర్లు (125 శాతం) సాధించినట్లు వివరించారు. రెండు గనులు కలిపి 20.43 లక్షల ఘనపు మీటర్ల లక్ష్యానికి 21.68 లక్షల ఘనపు మీటర్లు, అంటే 106 శాతం సాధించాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో ఏరియా వార్షిక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 3.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా నిర్ణయించినట్లు జీఎం తెలిపారు. కేటీకే ఓసీ-2, కేటీకే ఓసీ-3 గనుల్లో 20.18 లక్షల ఘనపు మీటర్ల ఓబీ తొలగింపు లక్ష్యంగా ఉందన్నారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో భాగంగా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తి స్థాయిని గణనీయంగా పెంచవచ్చని, కార్మికులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన హాజరు, సమయపాలన, బాధ్యతాయుతమైన పనితీరు సంస్థ అభివృద్ధికి కీలకమని జీఎం పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి, కార్మికుడు వర్కింగ్ పర్మిషన్తో పాటు అన్ని భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, రక్షణతో కూడిన ఉత్పత్తి ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జీఎం సూచించారు. ఓపెన్‌కాస్ట్ గనులు, బొగ్గు నిల్వ ప్రాంగణాలు, రవాణా రహదారులపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో గనుల్లో పనిచేసే కార్మికులు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఉత్పత్తి, రవాణా వ్యవస్థలు సజావుగా కొనసాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమిష్టి కృషి, క్రమశిక్షణ, భద్రతతో కూడిన ఉత్పత్తి అనే మార్గదర్శకంతో ముందుకు సాగితే నిర్దేశిత లక్ష్యాలను సాధించడంతో పాటు సంస్థ అభివృద్ధికి మరింతగా దోహదపడవచ్చని జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.