Take a fresh look at your lifestyle.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్.

0 3

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రతి గడపకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలి.
కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జడ్పీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, ఆగస్టు 15: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, మహనీయుల ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన సమరయోధులను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి స్వేచ్ఛ వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని, స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ప్రజలు బాధ్యతతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఉద్యోగులు నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సమసమాజ స్థాపన, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ఫలాలు ప్రతి గడపకు చేరేలా అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ పరస్పర సోదరభావంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షారైనా, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకటరెడ్డి, ఈఈ మహేష్‌బాబు, కలెక్టర్ క్యాంపు కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.