కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఏఐటీయూసీ పోరాట ఫలితమే : కొరిమి రాజ్‌కుమార్.
కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఏఐటీయూసీ పోరాట ఫలితమే.
కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతాం.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 9: సింగరేణి కార్మికుల పెర్క్స్‌పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. బుధవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ-2 గనిలో పిట్ సెక్రటరీ ఎండీ కరీముల్లా అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కార్మికుల పలు డిమాండ్లపై ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఇందులో భాగంగా కార్మికుల పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు అంగీకారం లభించిందన్నారు. కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసిందని, త్వరలోనే ఈ అంశంలో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు. 2016–17 జేఏంటీ ఉద్యోగులకు ఓవర్‌మెన్ పర్మిషన్, ప్రమోషన్లను ఖాళీల ఆధారంగా కాకుండా అర్హతకు అనుగుణంగా కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి కూడా అంగీకారం లభించిందని తెలిపారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు, అలాగే సహజ మరణం సంభవించిన సందర్భాల్లోనూ బ్యాంకు, కంపెనీ ద్వారా కలిపి రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేలా ఒప్పందం కుదిరిందన్నారు. పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. కార్మికుల రక్షణకు అవసరమైన పీఈ, ఇతర భద్రతా పరికరాలు, పని ముట్లను త్వరితగతిన అందించేలా ఒప్పందం జరిగిందన్నారు. ఈ ఒప్పందాలపై కొన్ని ఇతర కార్మిక సంఘాలు అపోహలు ప్రచారం చేస్తున్నాయని, కార్మికులు వాటిని నమ్మవద్దని రాజ్‌కుమార్ సూచించారు. ఏఐటీయూసీ కార్మికులను సొంత అన్నదమ్ములుగా భావిస్తూ, వారికి ఎలాంటి సమస్య ఎదురైనా ముందుండి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి తోట రాంచందర్, డీఎస్ సింగ్, పి. నారాయణ, సహాయ కార్యదర్శులు లుచేరాలు, సామ కృష్ణ, పిట్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.