Take a fresh look at your lifestyle.

కోల్‌ మైన్స్‌ పెన్షన్‌కు డీఏ లింక్‌ చేయాలి : ఆళవందార్‌ వేణు మాధవ్‌.

0 3

కోల్‌ మైన్స్‌ పెన్షన్‌కు డీఏ లింక్‌ చేయాలి.

కనీస పెన్షన్‌ను రూ.15 వేలకు పెంచాలి : ఆళవందార్‌ వేణు మాధవ్‌.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, సెప్టెంబర్ 10: దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన రంగానికి దశాబ్దాల పాటు సేవలందించిన బొగ్గు కార్మికులకు వృద్ధాప్యంలో గౌరవప్రదమైన పెన్షన్‌ అందించడం ప్రభుత్వాల బాధ్యత అని సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆళవందార్‌ వేణు మాధవ్‌ అన్నారు. కోల్‌ మైన్స్‌ పెన్షన్‌కు డీఏను అనుసంధానం చేసి, ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్‌ను క్రమం తప్పకుండా సవరించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో తనను సన్మానించిన ఆహ్వాన కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ విధానం, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1948లో అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బాబు జగ్జీవన్‌రామ్‌ చేతుల మీదుగా కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ప్రారంభమైందని తెలిపారు. అనంతరం 1971లో ఫ్యామిలీ పెన్షన్‌ స్కీం అమల్లోకి వచ్చిందని, అయితే ఆ పథకం ప్రధానంగా మరణించిన ఉద్యోగుల వితంతువులకు కుటుంబ పెన్షన్‌ అందించే విధంగానే ఉండేదని వివరించారు. దీర్ఘకాల పోరాటాల అనంతరం 1998 మార్చి 31 నుంచి కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ స్కీం అమల్లోకి వచ్చిందని వేణు మాధవ్‌ తెలిపారు. అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కనీస పెన్షన్‌ను రూ.350గా నిర్ణయించారని, దీనిని అప్పట్లో కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు లభించిన ‘మూడవ బెనిఫిట్‌’గా అభివర్ణించారని గుర్తుచేశారు. పెన్షన్‌ స్కీం నిబంధనల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్‌ను సమీక్షించి, ధరల పెరుగుదల, జీవన వ్యయానికి అనుగుణంగా సవరణలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ అంశంపై కార్మిక సంఘాల నాయకత్వం, ప్రభుత్వాలు తగిన స్థాయిలో దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. గత 25 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, విద్యుత్‌, ఇల్లు, రవాణా తదితర జీవన వ్యయాలు అనేక రెట్లు పెరిగాయని, కానీ వృద్ధాప్యంలో ఉన్న బొగ్గు కార్మికుల పెన్షన్‌ మాత్రం అందుకు అనుగుణంగా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోల్‌ మైన్స్‌ పెన్షన్‌కు డీఏ లింక్‌ చేయడం అత్యవసరమని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌లో క్రమం తప్పకుండా సవరణ జరిగే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే కనీస కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ను రూ.15,000కు పెంచాలని సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. వృద్ధాప్యంలో మందులు, వైద్య చికిత్సలు, రోజువారీ జీవన అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితుల్లో రూ.1,000 వంటి అతి తక్కువ మొత్తాన్ని కనీస పెన్షన్‌గా ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. “కనీస పెన్షన్‌ రూ.1,000 అనేది ఒక రాజకీయ నాయకుడు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా కాదు. అలాంటి మొత్తంతో జీవితాంతం బొగ్గు గనుల్లో శ్రమించిన కార్మికుడు వృద్ధాప్యంలో ఎలా జీవించగలడు?” అని వారు ప్రశ్నించారు. బొగ్గు గనుల్లో దశాబ్దాల పాటు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన కార్మికుల త్యాగాలను ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన రంగానికి నిరంతరం సేవలందించిన సింగరేణి కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక, వైద్య భద్రత కల్పించడంతో పాటు గౌరవప్రదమైన పెన్షన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి, తనను సన్మానించిన ఆహ్వాన కమిటీ సభ్యులకు ఆళవందార్‌ వేణు మాధవ్‌ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.