
సీఎంఓఏఐ న్యాయమైన డిమాండ్లకు సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 22:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో పనిచేస్తున్న అధికారుల న్యాయమైన డిమాండ్లకు సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అధికారులకు చెల్లించవలసిన PRP (Performance Related Pay)ను వెంటనే విడుదల చేయాలని, అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)లో అమలులో ఉన్న Pay Upgradation విధానాన్ని SCCLలో కూడా తక్షణమే అమలు చేయాలని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) చేస్తున్న ఆందోళనకు సంఘం మద్దతు తెలిపింది. అధికారుల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమం న్యాయసమ్మతమైనదని సంఘం అభిప్రాయపడింది. వారి సమస్యలను యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని సంఘం కోరింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు పంజాల శ్రీనివాస్, చీఫ్ అడ్వైజర్ చిల్కా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి చంద్రమౌళి, జనరల్ సెక్రటరీ వూట్ల దేవాచారి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఆందోళనకు తమ సంఘం అన్ని విధాలా అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఆందోళన విజయవంతమై అధికారులకు న్యాయం జరుగాలని ఆకాంక్షించారు.