విశ్వకర్మ జయంతిని సింగరేణిలో ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ విమోచన దినోత్సవాన్నీ ఘనంగా జరపాలి.
బీఎంఎస్ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 16: సృష్టికి మూలకారకుడు, ప్రపంచపు తొలి ఇంజనీర్‌గా, శిల్పిగా ఆరాధించే శ్రీ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను సెప్టెంబర్ 17న సింగరేణి బొగ్గు గనుల వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇదే రోజున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశ పారిశ్రామిక, కార్మిక లోకానికి, సింగరేణి కార్మిక సోదరులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మంలో శ్రీ విశ్వకర్మను ప్రపంచపు తొలి ఇంజనీర్‌గా, శిల్పిగా పూజిస్తారని అప్పాని శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి పునాది వేసిన మహనీయుడిగా విశ్వకర్మను కొనియాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా పారిశ్రామిక ప్రాంతం, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన నేపాల్లోనూ విశ్వకర్మ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని ఆయన వివరించారు.
పనిముట్లకు, యంత్రాలకు ప్రత్యేక పూజలు:
విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాల నిపుణులు, చేతివృత్తిదారులు, హస్తకళాకారులు, మెకానిక్‌లు, స్వర్ణకారులు, వెల్డర్లు, ఫ్యాక్టరీ కార్మికులు తమ పనిముట్లు, యంత్రాలను శ్రీ విశ్వకర్మ స్వరూపంగా భావించి శుభ్రపరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అప్పాని శ్రీనివాస్ తెలిపారు. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులు కూడా నాగళ్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను శుభ్రపరిచి పూజించి నివాళులర్పిస్తారని చెప్పారు.
సింగరేణి కార్మికులకు బీఎంఎస్ పిలుపు:
దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సింగరేణి కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది తమ తమ గనులు, వర్క్‌షాప్‌లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అప్పాని శ్రీనివాస్ కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమం, సింగరేణి సంస్థ పురోగతిని కాపాడాలని శ్రీ విశ్వకర్మ భగవానుడిని ప్రార్థిస్తూ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.