కొత్తగూడెంలో ఈ నెల 6న చెస్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు.
అండర్–15 బాలబాలికలకు జిల్లా స్థాయి సెలక్షన్స్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, సెప్టెంబర్ 3: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–15 చెస్ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 6న నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భాస్కరరావు, కార్యదర్శి సీహెచ్ గోపీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని మేదరబస్తీలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐటీఐలో ఆదివారం ఒకరోజు పాటు ఈ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలను రాష్ట్రస్థాయి అండర్–15 పోటీలకు జిల్లా తరఫున పంపనున్నట్లు వెల్లడించారు. అండర్–10 బాలబాలికలకు కూడా జిల్లా స్థాయి చెస్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కోశాధికారి రంజిత్‌కుమార్ తెలిపారు. పోటీలు స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజేతలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐటీఐ డైరెక్టర్ కే.వేలన్‌కుమార్ ట్రోఫీలు, బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు 9440162749 నంబర్‌ను సంప్రదించాలని కార్యదర్శి సీహెచ్ గోపీకృష్ణ సూచించారు.