Take a fresh look at your lifestyle.

కార్మికుల హక్కులు, ఉపాధిని కాపాడేందుకు ఐక్య పోరాటం : అమర్జిత్ కౌర్.

0 4

కార్మికుల హక్కులు, ఉపాధిని కాపాడేందుకు ఐక్య పోరాటం.
ప్రభుత్వ విధానాలు కార్మికులు, పేదలు, చిన్న వ్యాపారులపై భారాన్ని పెంచుతున్నాయి.

ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్.
కరీంనగర్ లో ఘనంగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు. 
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 7: దేశంలోని కార్మికులు, రైతులు, పేదలు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికుల హక్కులు, ఉపాధి, సామాజిక భద్రతను కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు, చిన్న పరిశ్రమలు, పేద ప్రజలపై భారాన్ని పెంచుతున్నాయని ఆమె విమర్శించారు. కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం జరిగిన సమావేశంలో అరుణపతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి అమర్జిత్ కౌర్ ప్రసంగించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, దిగుమతి సుంకాలు, దేశీయ చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలపై వాటి ప్రభావాన్ని ఆమె ప్రస్తావించారు. దేశ ఆర్థిక విధానాలు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా ఉండాలని, సహజ వనరులు, ఖనిజ సంపదను విదేశీ సంస్థలకు అప్పగించే విధానాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దేశంలోని సహజ వనరులు ప్రజల సంపదగా దేశ ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాల వల్ల చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు నష్టపోయాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై బాధ్యత వహించాలని, ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల నిర్వచనాన్ని మార్చే ప్రయత్నాలు కార్మికుల హక్కులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని అమర్జిత్ కౌర్ అన్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సహాయక సిబ్బంది కూడా కార్మికులేనని, వారికి వేతనాలు, సామాజిక భద్రత, పని గంటలు, కార్మిక సంఘాల హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ట్రేడ్ యూనియన్లు మరింత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలోని సమస్త కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెల్లడించిన వివరాలపై కూడా అమర్జిత్ కౌర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై ప్రభుత్వం చెబుతున్న వివరాలకు, అనంతరం వెలువడిన వార్తలకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, ఎం.డి. యూసుఫ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్, భూపాలపల్లి నుంచి జి. శ్రీనివాస్, ఎం.డి. ఆసిఫ్ పాషా, క్యాతరాజు సతీష్, నూకల చంద్రమౌళి తదితర 21 మంది ఏరియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.