
భూపాలపల్లి సింగరేణి గనుల్లో ఘనంగా విశ్వకర్మ జయంతి.
పనిముట్లకు పూజలు.. శ్రమను గౌరవించుకోవడమే విశ్వకర్మ పూజ: బీఎంఎస్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 17: జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1, 5, 6, 8 ఇంక్లైన్‌లు, కేటీకే ఓసీ-2, ఓసీ-3 బొగ్గు గనుల్లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి కోల్ మైన్స్ కర్మచారి సంఘ్ (ఎస్సీఎంకేఎస్)-బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆయా గనుల వద్ద కాషాయ జెండాలను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను బ్రహ్మ ఏడవ కుమారుడిగా, దేవతల ప్రధాన ఇంజనీర్, వాస్తుశిల్పిగా భావిస్తారని బీఎంఎస్ నాయకులు తెలిపారు. రావణుడి లంకా నగరం, శ్రీకృష్ణుడి ద్వారకా నగరం వంటి నిర్మాణాలతో పాటు విష్ణువుకు సుదర్శన చక్రం, శివుడికి త్రిశూలం, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని విశ్వకర్మ రూపొందించినట్లు పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి విమానంగా పరిగణించే పుష్పక విమానాన్ని కూడా విశ్వకర్మ నిర్మించినట్లు వివరించారు. సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించే కన్యా సంక్రాంతి రోజునే విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారని, అదే సెప్టెంబర్ 17న వస్తుందని తెలిపారు. విశ్వకర్మకు మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనే ఐదుగురు కుమారులు ఉన్నారని, వారి నుంచి కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారుల వంటి చేతివృత్తులు అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. అందుకే ఇంజనీర్లు, మెకానిక్‌లు, వెల్డర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, మైనింగ్ కార్మికులు తమ పనిముట్లను పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ‘పనిని పూజించడమే విశ్వకర్మ పూజ’ అనేది బీఎంఎస్ సిద్ధాంతమని తెలిపారు. సింగరేణి కార్మికులు ప్రతిరోజూ భూగర్భ గనుల్లోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికితీస్తున్నారని, డ్రిల్, షావెల్, డంపర్ వంటి పనిముట్లే తమ ఆయుధాలని పేర్కొన్నారు. ఆ పనిముట్లకు శక్తినిచ్చే విశ్వకర్మను పూజించడం అంటే తమ శ్రమను తాము గౌరవించుకోవడమేనన్నారు. తెలంగాణ స్వేచ్ఛ కోసం నిజాం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని పేర్కొంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేటీకే ఓసీ-2: సీనియర్ కార్మికుడు దేవేందర్ జెండాను ఆవిష్కరించారు. ఎస్సీఎంకేఎస్-బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, బ్రాంచి కోశాధికారి రఘుపతి రెడ్డి, నరహరి, సుధాకర్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు. కేటీకే-1 ఇంక్లైన్: మోడెం కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. పిట్ కార్యదర్శి ఓరం లక్ష్మణ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి భాస్కర్, కుమార్, కార్మికులు పాల్గొన్నారు. కేటీకే-5 ఇంక్లైన్: పిట్ కార్యదర్శి రాజు నాయక్ జెండాను ఆవిష్కరించారు. బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ వెలబోయిన సుజెందర్, సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఈర్ల సదానందం, బ్రాంచి నాయకులు పని రమేష్, ఫిట్టర్ రాజు, సురేష్, శ్రీనివాస్, చందు నాయక్, సమ్మయ్య తదితరులు, కార్మికులు పాల్గొన్నారు. కేటీకే-6 ఇంక్లైన్: బ్రాంచి నాయకుడు బత్తుల స్వామి జెండాను ఆవిష్కరించారు. అసిస్టెంట్ పిట్ కార్యదర్శి చిట్యాల ప్రవీణ్, కనకయ్య, నరహరి, సుధాకర్, కార్మికులు పాల్గొన్నారు. కేటీకే-8 ఇంక్లైన్: పిట్ సెక్రెటరీ అడప రాజు జెండాను ఆవిష్కరించారు. బ్రాంచి కార్యదర్శి రేణికుంట్ల మల్లేష్, బ్రాంచి నాయకులు ప్రేమ్ సింగ్, డి.నారాయణ, ఎండి యూసఫ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి శీలం రాజు, భరత్, తిరుపతి రెడ్డి తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.