గుర్తింపు సంఘాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి.
టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ధ్వజం.
జీడీకే-2 ఇంక్లైన్లో భారీగా యువ కార్మికుల చేరిక. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబరు 30: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల హక్కులను పరిరక్షించడంలో విఫలమవుతున్నాయని, రెండున్నరేళ్లుగా అనేక హక్కులను కాలరాస్తూ కార్మికులను మోసం చేస్తున్నాయని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుర్తింపు సంఘాల వైఖరిని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-2 ఇంక్లైన్ గని ఆవరణలో బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 1998లో జాతీయ కార్మిక సంఘాల ఒప్పందంతో రద్దయిన డిపెండెంట్ ఉద్యోగాలను బీఆర్ఎస్–టీబీజీకేఎస్ హయాంలో కారుణ్య నియామకాల ద్వారా పునరుద్ధరించి 13,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల వారసత్వ హక్కును తాకట్టు పెట్టాయని విమర్శించారు. మెడికల్ బోర్డు కోసం సుమారు 2,500 మంది ఎదురుచూస్తున్నా వారి సమస్యను పట్టించుకునే వారు లేరని రాజిరెడ్డి అన్నారు. 120 మంది బోర్డు పరిశీలనకు హాజరైతే కేవలం 15 మంది మాత్రమే అన్‌ఫిట్ అయ్యారని పేర్కొన్నారు. గతంలో నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి 100 శాతం అన్‌ఫిట్ కేసులను పరిష్కరిస్తామని చెప్పిన సంఘాలు ఇప్పుడు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మైనింగ్ స్టాప్ కార్మికులకు సూటబుల్ ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పిన సంఘాలు, మైనింగ్ కార్మికులకు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కేటాయించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు, పనిముట్లు, డ్రిల్ బిట్లు, కీల్లు అందుబాటులో లేకపోయినా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గత పరీక్షల ద్వారా భర్తీ చేస్తామని, రెండు నెలల్లో క్లరికల్ పరీక్షలు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. టీబీజీకేఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేయడం లేదని తెలిసిన సమయంలో తమ మద్దతు కోసం ఏఐటీయూసీ నాయకులు తమ ఇళ్ల చుట్టూ తిరిగారని గుర్తుచేశారు. టీబీజీకేఎస్ హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే, ప్రస్తుతం గుర్తింపు సంఘం హయాంలో కార్మికులకు డిస్మిసల్, చార్జిషీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది యువ కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. పిట్ కార్యదర్శి ఉప్పులేటి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ కోశాధికారి చెల్పూరి సతీష్, కేంద్ర నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, పాశం శ్రీనివాస్ రెడ్డి, దూట శేషగిరి, మీస రాజు దేవేందర్, పర్లపల్లి అభిషేక్, వాసర్ల జోసెఫ్, పులిపాక శంకర్, అప్సర్ పాషా, నూతి రాజ్‌కుమార్, నరేష్ పటేల్, ప్రసాద్ కుమార్, మధు, టిప్పు సుల్తాన్, సుకుమార్, జస్వంత్, మహేష్, రమణ, ప్రవీణ్, సమ్మయ్య, శశికుమార్, ప్రవీణ్ రావు, బీమా అర్జున్ రెడ్డి, కాటన్ సురేష్‌తో పాటు టీబీజీకేఎస్ శ్రేణులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.