
ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హరిత సమీక్ష సమావేశం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఆసిఫాబాద్, మే 27:రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఎస్పీ అశోక్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 1న కెరమరి మండలం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ నివాస గృహాల ప్రారంభోత్సవం, లబ్ధిదారులతో భోజనం, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. హెలిప్యాడ్ వద్ద ప్రముఖులకు స్వాగతం, షామియానాలు, పైలాన్ ప్రారంభం, పార్కింగ్ ఏర్పాట్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రహదారులపై గుంతలను వెంటనే పూడ్చాలని అధికారులకు ఆదేశించారు. సాయంత్రం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున త్రాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, హెలిప్యాడ్ వద్ద భారీ కేడింగ్, వైద్య బృందాలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొఠారి గ్రామం నుంచి కాగజ్‌నగర్ సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణించనున్నందున మార్గమధ్యంలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. సభా ప్రాంగణంలో ప్రముఖుల గ్యాలరీ, వీడియో గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచిస్తూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఈనెల 29న రెబ్బెన మండలం రౌట్ సంకెపల్లిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పర్యటన నేపథ్యంలో కూడా ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై గవర్నర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గవర్నర్ హెలికాప్టర్ ద్వారా రానుండటంతో హెలిప్యాడ్ వద్ద అంబులెన్స్, కాన్వాయ్ సిద్ధంగా ఉంచాలని, కలెక్టరేట్ వద్ద పోలీసు గౌరవ వందనం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గవర్నర్ పర్యటనకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.