సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కుల కోసం మారుతి సేవలు కొనసాగాలి.
డీజీఎం (పర్సనల్) కె. మారుతి పదవీ విరమణ సభలో కామెర గట్టయ్య.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 31: సింగరేణి సంస్థలో 37 సంవత్సరాల పాటు నిబద్ధతతో సేవలందించిన డీజీఎం (పర్సనల్) కావూరి మారుతి పదవీ విరమణ అనంతరం కూడా సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కుల సాధన, నిరుపేద ప్రజల సంక్షేమం కోసం తన అనుభవాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆకాంక్షించారు. భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మారుతి పదవీ విరమణ సన్మాన సభలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కె. మారుతి, ఆయన సహచరిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్న న్ గట్టయ్య మాట్లాడుతూ, 1989లో రామగుండం ఓసీపీ-1లో క్లర్క్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కె. మారుతి వెల్ఫేర్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, అనంతరం డీజీఎం (పర్సనల్)గా వివిధ హోదాల్లో సమర్థవంతంగా సేవలందించారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సామాజిక ఉద్యమాలు, అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగిన ఆయన, ఉద్యోగ జీవితంలోనూ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పనిచేశారని కొనియాడారు. సింగరేణిలో జరిగిన అనేక కార్మిక ఉద్యమాల స్ఫూర్తితో సంస్థలో చేరిన మారుతి, తన విధి నిర్వహణలోనూ కార్మికుల పక్షాన నిలిచారని పేర్కొన్నారు. పదవీ విరమణతో సేవలకు ముగింపు కాదని, ఇకపై సమాజానికి మరింత సేవ చేసే అవకాశం లభించిందని, ఆ అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు దాసరి జనార్దన్, గోడిసెల శ్రీహరి, కాసర్ల ప్రసాద్ రెడ్డి, నామాల శ్రీనివాస్, జలగం రాజు, సిల్వర్ మనోజ్, రాళ్లబండి బాబు, వెంకటేష్, జయశంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.