సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా.
మారుపేర్ల సమస్య, మెడికల్ బోర్డు అంశాల పరిష్కారానికి కృషి:. డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి.
కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఐరేని ఉదయ్ కుమార్ లకు ఘన సన్మానం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జూన్ 1: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేర్ల (అలియాస్) సమస్యతో పాటు మెడికల్ బోర్డు నిర్వహణ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఈపీ ఆపరేటర్స్ యూజీ ఆల్ ట్రేడ్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి హామీ ఇచ్చారు. సోమవారం ఇల్లెందు గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆల్ ఇండియా మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఎండబ్ల్యూఎఫ్) అఖిల భారత ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎన్నికైన ఐరేని ఉదయ్ కుమార్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఐరేని ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు సమావేశాలను త్వరగా నిర్వహించాలని డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారిని కోరారు. దీనిపై స్పందించిన డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, కార్మికుల సమస్యల పట్ల తాను సానుకూలంగా ఉన్నానని, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని తెలిపారు. సింగరేణి కార్మికులకు త్వరలోనే తీపి కబురు అందేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అనంతరం ఏఐఎండబ్ల్యూఎఫ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎన్నికైన ఐరేని ఉదయ్ కుమార్‌లను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్కూరి రవీందర్ రెడ్డి, కూచన అశోక్, కటకం కమలాకర్, శంకర్‌ధయాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.