పాత పీఆర్పీ రికవరీలను ‘శాలరీ అడ్వాన్స్’గా గుర్తించిన సింగరేణి.
620 మంది ఎగ్జిక్యూటివ్‌లకు వర్తింపు. రిటైర్డ్ అధికారుల లోటు పీఆర్పీ, వైద్య బిల్లుల నుంచి సర్దుబాటు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 8:2007-08 నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ)లో ఏర్పడిన నెట్ డెఫిసిట్ (లోటు) మొత్తాలను ‘శాలరీ అడ్వాన్స్’గా పరిగణిస్తూ సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగం జనరల్ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ) జూలై 7న (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం, 2007-08 నుంచి 2013-14 వరకు ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లించిన పీఆర్పీకి సంబంధించిన లోటు బ్యాలెన్స్‌లను సర్దుబాటు చేస్తూ క్లోజర్ ఎంట్రీలు నమోదు చేసేందుకు సమర్థ అధికారి ఆమోదం తెలిపారు. జీఎల్ కోడ్–2282613 కింద ఉన్న లోటు కేసుల్లో మొత్తం రూ.1.84 కోట్లను శాలరీ అడ్వాన్స్‌గా గుర్తించారు. ఈ నిర్ణయం మొత్తం 620 మంది ఎగ్జిక్యూటివ్‌లకు (ఆన్-రోల్, నాట్-ఆన్-రోల్) వర్తించనుంది. 315 మంది ఆన్-రోల్, 51 మంది నాట్-ఆన్-రోల్ ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించిన లోటు మొత్తాలను 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించాల్సిన పీఆర్పీతో పాటు తదుపరి సంవత్సరాల పీఆర్పీ బకాయిల నుంచి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 2022 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ చేసిన 254 మంది నాట్-ఆన్-రోల్ ఎగ్జిక్యూటివ్‌లకు పీఆర్పీ బకాయిలు అందుబాటులో లేకపోవడంతో, వారికి లభించే వార్షిక ఔట్‌పేషెంట్/డొమిసిలియరీ వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ (ఏడాదికి రూ.36 వేల వరకు) నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. మార్చి 31, 2026 నాటికి రూ.1.83 కోట్లను శాలరీ అడ్వాన్స్‌గా ఖాతాల్లో నమోదు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంప్లాయీ కోడ్ వివరాలు అందుబాటులో లేని 34 మంది ఉద్యోగులకు సంబంధించిన సుమారు రూ.0.01 కోట్లను తాత్కాలికంగా సింగిల్ వెండర్ కోడ్ కింద నమోదు చేశారు. భవిష్యత్తులో రికవరీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు, ఉద్యోగుల వారీగా శాలరీ అడ్వాన్స్‌లను సర్దుబాటు చేసే ప్రక్రియను SAP-హెచ్‌ఆర్, ఈఈ సెల్ నిరంతరం పర్యవేక్షించాలని జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) సంబంధిత అధికారులను ఆదేశించారు.