బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెరిగినప్పటికీ సరిపోవు
– టిఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్

భీంగల్ ప్రతినిధి, జూలై 25 ( లోకంతీరు ) : గత సంవత్సరం రూ.2,90,000 కోట్ల బడ్జెట్ లో విద్యారంగానికి రూ.19,093 కోట్లు కేటాయించారని, ఈ సంవత్సరం రూ.2,91,000 కోట్ల బడ్జెట్ లో రూ.21,292 కోట్లు కేటాయించారని టిఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ లో విద్యారంగానికి గత సంవత్సరం కంటే రూ.2,200 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15% లో సగానికి మించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్దికి ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని, వెంటనే పునఃసమీక్షించి విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని ఆర్థిక మంత్రిని ఆయన కోరారు. పలు పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని నూతన భవనాలు నిర్మించి శౌచాలయాలు, త్రాగు నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అల్పాహారం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించటానికి నిధులు కేటాయించాలని ఇంకా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సర్వీసు పర్సన్ల నియామకం, ఉచిత విద్యుత్తు అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవటం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంగన్ వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 3వ తరగతి వరకు ప్రాథమిక విద్యను విలీనం చేయాలని నిర్ణయించటం ప్రభుత్వ విద్యారంగానికి పెద్ద దెబ్బ అవుతుందని, కావున ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు అంగన్ వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించడం లేదని, ప్రాథమిక తరగతులను అంగన్ వాడీల్లో విలీనం చేయటం వలన పలు ప్రాథమిక పాఠశాలలు మూతబడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యలో సంస్కరణలు చేసేముందు క్షేత్రస్థాయిలో ప్రధాన భాగస్వాములైన తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.